బాధ్యతగా హెల్మెట్ ధరించాలి
జాయింట్ రవాణా కమిషనర్ మోహన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించాలని, అది ప్రమాదాల తీవ్రతను తగ్గించి ప్రాణాలను కాపాడుతుందని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. మహాత్మాగాంధీరోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద ఆదివారం హెల్మెట్ ధరించని వాహనదారులపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎ. మోహన్ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 31 వరకూ రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వాహనదారులకు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో సంవత్సరానికి వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.


