అమెరికాది యుద్ధోన్మాదం: సీపీఎం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని అందరూ నిరసించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వెనిజులా దేశ అధ్యక్షుడు మదురో అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనిజులా ఆయిల్ నిక్షేపాలపై పెత్తనం కోసమే అమెరికా అక్రమ దాడులకు పాల్పడిందన్నారు. అమెరికా మూడో ప్రపంచదేశాలపై అమానుషంగా విరుచుకుపడుతుందన్నారు. తన పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికి ఎంతటి దుశ్చర్యలకైనా వెనుకాడడం లేదని విమర్శించారు. ఈ దాడులు, అరెస్ట్‌లను ప్రపంచం యావత్ ముక్తకంఠంతో ఖండిస్తున్నా, మనదేశ పాలకులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. ప్రపంచ ఆధిపత్య అహంకారంతో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం గర్హనీయమన్నారు. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డ్రగ్స్ సరఫరా చేసే దేశాల జాబితాలో వెనిజులా లేదని గుర్తుచేశారు. ప్రపంచ సహజ సంపదపై తనదేశ కంపెనీల పెత్తనానికే అమెరికా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మధురో, ఆయన భార్యను డ్రగ్స్ పేరుతో అక్రమ అరెస్టులకు పాల్పడడం అమెరికా ఒంటెత్తు పోకడలకు నిదర్శమన్నారు. అమెరికా పెత్తనాన్ని అందరూ ఖండించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి, ఆపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


