జూడోలో ఒలింపిక్ మెడల్ సాధించాలి
అవనిగడ్డ: జూడో క్రీడల్లో దివిసీమ క్రీడాకారులు ఒలింపిక్ మెడల్ సాధించాలని బొండాడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. అవనిగడ్డలోని ఎస్‌విఎల్ క్రాంతి కళాశాలలో కృష్ణాజిల్లా జూడో అసోసియేషన్ వారిచే బొండాడ రాఘవేంద్రరావు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన జూడో శిక్షణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ జూడో క్రీడలో శిక్షణ పొందితే ఆరోగ్యం, ఆత్మరక్షణతోపాటు ఈరంగం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్కానరు. ఒలింపిక్, ఏషియా గేమ్స్ పోటీల్లో స్థానం కలిగిన జూడో క్రీడల్లో ఆంతర్జాతీయ స్థాయి టోర్నమెంటును రాష్ట్రంలో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి జల క్రీడల్లో మెడల్స్ సాధిస్తున్న దివిసీమ బాలిక నాగిడి గాయిత్రి స్ఫూర్తితో విద్యార్థులు జూడోలో పతకాలు సాధించాలని సూచించారు.
ఈసందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన జూడో క్రీడాకారులు అద్భుతమైన జూడో విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌విఎల్ క్రాంతి విద్యాసంస్థల చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావు, జూడో అసొసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి నామిశెట్టి వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ గమిడి శ్రీనివాసరావు ప్రసంగించారు. జూడో శిక్షణా కేంద్రం నిర్వహణకు అవసరమైన షీట్స్, దుస్తులను రాఘవేంద్రరావు అందజేశారు.


