
ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం..
లబ్బీపేట(విజయవాడతూర్పు): మందుల షాపుల్లో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుంది. మత్తు మందులతోపాటు, కాలం చెల్లిన మందులు, ఫిజీషియన్ శాంపిల్స్‌ను కూడా అమ్మేస్తున్నారు. ఈగిల్ బృందాలు మొదటివిడత తనిఖీల్లో అలాంటి మందులను గుర్తించి, పలు షాపులను సీజ్ చేయగా, తిరిగి అవి యథావిధిగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా ఔషధ నియంత్రణ మండలి అధికారులు సైతం ఈ మెడికల్ మాఫియాను ఏం చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో అక్రమ మందుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
మత్తు మందుల విక్రయాలు..
నగరంలోని పలు షాపుల్లో మత్తు మందుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నచిన్న ఆస్పత్రిల లైసెన్స్‌లను చూపించి మత్తుమందులు కొనుగోళ్లు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా మత్తుమందులు కొనుగోళ్లు చేసిన ముఠాసభ్యులు వాటిని ఇతర ప్రాంతాలకు కొరియర్ ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా వెలుగు చూశాయి. పుష్పా హోటల్ సమీపంలోని ఓ షాపు నుంచి చైన్నెకు మత్తు మందులు సరఫరా చేయగా, అక్కడి పోలీసులు పట్టుకుని ఇక్కడకు తనిఖీలకు వచ్చారు. మూడు రోజుల కిందట మత్తు పదార్థాలు కలిగి ఉన్న యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బీఆర్‌టీఎస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు మత్తుమందులు వస్తుండగా, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తుండటం గమనార్హం.
కాలం చెల్లిన మందులు విక్రయం.
జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లోని మందుల షాపుల్లో కాలం చెల్లిన మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. గతంలో ఈగల్ టీం తనిఖీల్లో సైతం పలు షాపుల్లో కాలం చెల్లిన మందులు ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆయాషాపుల లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయగా, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో మళ్లీ లైసెన్స్‌ను పునరుద్ధరించినట్లు తెలిసింది. అధికారపార్టీ నేతలు అండదండలు ఉంటే అక్రమవ్యాపారం చేసినా ఏమి కాదనే రీతిలో పలువురు రెచ్చిపోతున్నారు. దీంతో మార్కెట్‌లోకి కాలం చెల్లిన మందులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రజలకు బ్రాండెడ్ మందుల ధరలకే జనరిక్ మందులను సైతం అంటగడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ నియంత్రణ మండలి అధికారులు స్పందించి మందుల మాయాజాలం బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
గుట్టుగా మత్తుమందుల అమ్మకాలు
కాలం చెల్లిన మందులు,
శాంపిల్స్ కూడా ..
గతంలో ఈగల్ బృందం
తనిఖీల్లో వెలుగులోకి
అయినా ఆగని తంతు
అమ్మకాలపై కొరవడిన నిఘా
కాలం చెల్లిన మందులు, ఫిజీషియన్ శాంపిల్స్ విక్రయాలపై ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటాం.
డాక్టర్ కె.అనీల్‌కుమార్, అసిస్టెంట్
డైరెక్టర్, ఔషధ నియంత్రణ మండలి