కాంట్రాక్టర్ల పాలిట కామధేనువు ఘాట్‌ రోడ్డు | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ల పాలిట కామధేనువు ఘాట్‌ రోడ్డు

Aug 3 2025 8:44 AM | Updated on Aug 3 2025 8:44 AM

కాంట్రాక్టర్ల పాలిట కామధేనువు ఘాట్‌ రోడ్డు

కాంట్రాక్టర్ల పాలిట కామధేనువు ఘాట్‌ రోడ్డు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి చేరుకునే ఘాట్‌రోడ్డు కాంట్రాక్టర్ల పాలిట కామధేనువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా దుర్గగుడి ఘాట్‌రోడ్డులో రాక్‌ బోల్టింగ్‌, మెస్‌ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న పనులు ఇంకా కొలిక్కి రాలేదు. మూడేళ్లలో కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నా, చిన్నపాటి వర్షం వస్తే చాలు ఘాట్‌రోడ్డు మూసివేయడంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్‌రోడ్డులో రాక్‌ బోల్టింగ్‌ పనులు చేపట్టారు. ఆ తర్వాత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో దసరా ఉత్సవాలలో కొండ రాళ్లు విరిగి పడటంతో ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు రూ.70 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ఘాట్‌రోడ్డులో కొండ రాళ్లు విరిగినా నేరుగా రోడ్డుపైకి రాకుండా రాక్‌వాల్‌, ఓం టర్నింగ్‌ నుంచి రెండో మలుపు వరకు ఐరన్‌ మెస్‌ పనులు చేపట్టారు. అయితే గత ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి మళ్లీ ఐరన్‌ మెస్‌ పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు రూ.20 కోట్లు పైబడే ఘాట్‌రోడ్డు అభివృద్ధికి దేవస్థానం నిధులు ఖర్చు చేసింది. అయితే భక్తులు దేవస్థాన అభివృద్ధికి ఇచ్చిన విరాళాలు, కానుకల నుంచి చేపట్టిన పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా చిన్నపాటి వర్షం కురిస్తే వెంటనే ఘాట్‌రోడ్డును మూసివేయడం పరిపాటిగా మారింది. గత వారం నాలుగు రోజుల పాటు వర్షం కురవడంతో ఆ నాలుగు రోజులు ఘాట్‌రోడ్డును మూసివేశారు. కనీసం భక్తులను సైతం నడిచేందుకు వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి ఇన్ని కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు నిరుపయోగమేనా అని భక్తులు ఆలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

తరచూ విరిగి పడుతున్న కొండరాళ్లు

దేవస్థానం కొండ రాళ్లు విరిగి పడకుండా ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. గత ఏడాది దసరా ఉత్సవాలకు ముందు సెప్టెంబర్‌ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ఘాట్‌రోడ్డులోని డోనర్‌ సెల్‌ వద్ద భారీ కొండ రాయి, మట్టి జారిపడటంతో డోనర్‌ సెల్‌ దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్పటికే కొద్ది నెలల కిందట ఆ ప్రాంతంలో ఐరన్‌ మెస్‌ పనులు జరిగాయి. ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ ఐరన్‌ మెస్‌ను ఏర్పాటు చేయించింది. ఇప్పడు అదే ప్రాంతానికి కూతవేటు దూరంలో మళ్లీ కొండ చరియలు విరిగి పడటం గమనార్హం.

రూ.కోట్లతో చేసిన పనులు నిరుపయోగమేనా?

వర్షం వస్తే చాలు మూత వేయాల్సిందేనా?

విరిగిపడుతున్న కొండచరియలను నియంత్రించలేరా?

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement