
వేతన వేదన..
వరుసగా రెండో నెలలోనూ గురువులకు అందని జీతాలు
ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు
బదిలీ అయిన ఉపాధ్యాయులు, ప్రమోషన్లు పొందిన గురువులు చాలా మందికి జీతాలు పడక ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంతో జీతాలు ఆపడం హాస్యాస్పందంగా ఉంది. ప్రభుత్వం తలచుకుంటే నిమిషాల్లో జరిగే పనిని సాకుగా చూపి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణం. తక్షణం ప్రభుత్వం స్పందించాలి. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ఐక్య సమాఖ్య పక్షాన ఆందోళన చేయటానికి సమాయత్తమవుతున్నాం.
– ఎ.సుందరయ్య,
జిల్లా చైర్మన్, ఫ్యాప్టో, ఎన్టీఆర్‌జిల్లా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బదిలీలు అయిన గురువులను వేతన వెతలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండో నెలా జీతాలు అందలేదు. జూన్‌లోనే ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. అందులో పలువురికి వారు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి పొజిషన్ ఐడీలు రాకపోవడంతో ప్రభుత్వం జూలై మొదటి తేదీ వారికి ఇవ్వాల్సిన జూన్ జీతభత్యాలు నిలిపివేసింది. తాజాగా ఆగస్టులో జీతాలు పడలేదు. ఇలా ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు వేల మందిపైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాంకేతిక సమస్యల పేరుతో ఎగనామం
పాఠశాల మారిన గురువులకు, స్థాయి మారిన ఉపాధ్యాయులకు రెండు మాసాల నుంచి జీతాలు వేయకపోవటానికి సాంకేతిక సమస్యలను విద్యాశాఖ అధికారులు ఎత్తి చూపుతున్నారు. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నా వీరి స్థానం మారడంతో ఏ పాఠశాలకు, ఏ స్థానానికి బదిలీ అయ్యారో దానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. సీఎప్‌ఎంఎస్‌లో వారి వివరాలను ప్రభుత్వం పొందుపరుస్తుంది. అప్పుడే వేతనాలు ఇవ్వడానికి అవకాశముంటుంది. పొజిషన్ ఐడీ ఇవ్వడంలో ఆలస్యం కారణంగా రెండు నెలల జీతం బదిలీ అయిన ఉపాధ్యాయుల ఖాతాలకు ఇప్పటి వరకు జమ కాలేదు.
కావాలనే నిర్లక్ష్యం..?
ఉపాధ్యాయులపై ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయా ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. యోగాంధ్ర, మెగా పేరెంట్స్ మీట్ వంటి కార్యక్రమాలకు ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి, ఎలా జరిగిందనే అంశాలను క్షణంలో ప్రభుత్వ పెద్దలు తెలుసుకున్నారు. మరి ఉపాధ్యాయుల సమాచారం తెలుసుకోవడానికి, వారికి ఐడీలు కేటాయించడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రెండు నెలలుగా ఐడీలు కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
నాలుగువేల మందికిపైగా
అందని జీతాలు..?
ఉమ్మడి జిల్లాలో సుమారుగా 12,612 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇతర సిబ్బంది వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. వారిలో సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల మందికిపైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. అందులో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సమానస్థాయి కేడర్ ఉపాధ్యాయుల, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, ఆర్ట్/ డ్రాయింగ్/క్రాఫ్ట్ /మ్యూజిక్ /ఉపాధ్యాయులు తదితర కేడర్లలో ఉన్న వారు బదిలీ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ఏర్పడటంతో ఇక్కడకు వచ్చిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి రెండు నెలలవుతున్నా పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో సుమారుగా నాలుగు వేల మందికి పైగా రెండు నెలల జీతాలు అందలేదు.
అప్పులపాలు..!
ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటంతో అప్పులపాలువుతున్నామంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. అప్పులు పుట్టే పరిస్థితి ఉండదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఖర్చులకు, పిల్లల ఫీజులు ఇతర చెల్లింపులకు అప్పులు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం కావాలనే ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తోందని వారు మండిపడుతున్నారు.
సంఘాల ఆందోళన బాట
ఉపాధ్యాయుల జీతాలు రాకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. వారం రోజుల్లో ఐడీలు కేటాయించి, జీతాలు చెల్లించా లంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, ఐడీల కేటాయింపు విషయంలో కావాలనే ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఆందోళన బాట పడితేనే ప్రభుత్వం స్పందిస్తుందని వారు చెబుతున్నారు. ఐదో తేదీ లోపు సమస్య పరిష్కారం కాకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామంటూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
బదిలీ అయిన ఉపాధ్యాయులకు కేటాయించని ఐడీలు వివరాలు లేక ఐడీలు జనరేట్ కాలేదంటున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సుమారుగా నాలుగు వేల మందికిపైగా జీతాలు ఏవీ! ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

వేతన వేదన..