
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
బంటుమిల్లి: మండల పరిధిలో సాగునీరు అందక పోవడంతో రైతులు సాగునీటి కోసం రైతు సంఘం ఆధ్వర్యాన శనివారం స్థానిక లక్ష్మీపురం సెంటర్‌లో ధర్నా చేశారు. రైతు సంఘం ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులు కృష్ణా నదిలో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రానికి పోతుంటే కాలువల్లో నీరు లేక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో వరి నాట్లు నిలిచిపోయాయని వారు పేర్కొన్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా బంటుమిల్లి ప్రధాన కాలువ శివారు భూములకు సాగునీరు రావడంలేదని రైతులు ఆరోపించారు. జూలై మొదటి వారంలో ఇదే పరిస్థితి నెలకొనగా పంటలు కాపాడుకోవడానికి వేలాది రూపాయలను ఆయిల్ కోసం ఖర్చు పెట్టామని తెలిపారు. మళ్లీ ఈ నెల మొదట్లోనే పరిస్థితులు ఇబ్బందిగా మారాయని రైతు సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బంటుమిల్లి మెయిన్ కాలువలో కేవలం మూడు అడుగులు నీరు మాత్రమే ఉందని దీని కారణంగా బ్రాంచి కాలువలకు నీరు అందదని నాయకులు తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించి బంటుమిల్లి ప్రధాన కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రైతు సంఘం డివిజన్ కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని పలు గ్రామాల రైతులు ఎం.శివరాం, పి.ఏసుబాబు, ఎన్.సత్యనారాయణ, ఆర్. జోజిబాబు, జి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.