
సాక్షి, విజయవాడ: ఏపీలో రామకుప్పం ఎంపీటీసీ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నారాయణ మూర్తి వినతి పత్నం అందజేశారు.
అనంతరం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘రెండు జడ్పీటీసీ, మూడు ఎంపీటీసీలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్ల స్క్రూట్నీ జరుగుతోంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్నాడు. మహిళలపై గౌరవం ఉన్నట్లు పదేపదే మాట్లాడతారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళ నామినేషన్‌ను అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కుంటుంటే పోలీసులు కనీసం అడ్డుకోలేకపోయారు. స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదు. ఇక బాధితులు ఎవరికి చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య విలువలు లేవు. కేసులు తీసుకునే పరిస్థితులు లేవు. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ మెట్లు ఎక్కుతూ దిగుతున్నాం. ఎన్నికల కమిషన్ తన విస్తృతమైన అధికారాలు వినియోగించాలి. మేం ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకూ సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేయాలన్నాం. ఆన్ లైన్ నామినేషన్లు స్వీకరణకు అనుమతించాలని కోరాం.
బీహార్ తరహా పరస్థితులు ఏపీలో నెలకొన్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పార్టీలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అధికారులు శాశ్వతం. అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తే వారికి ఇదే మా హెచ్చరిక. మేమూ డిజిటల్ లైబ్రరీ పెట్టాం. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారి పేర్లు డిజిటల్ లైబ్రరీలో చేర్చుతున్నాం. మేం అధికారంలోకి వచ్చాక వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. రామకుప్పం ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపాలి. లేకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘స్థానిక సంస్థలు జరిగే చోట జాగ్రత్తలు తీసుకోవాలని గతంలోనే మేం కోరాం. ఈ ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరిపించేలా లేదని మేం ముందుగానే చెప్పాం. రామకుప్పం ఎంపీటీసీ అభ్యర్ధి, దళిత మహిళ శ్రీదేవిని నామినేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె వద్ద బ్యాగ్ లాక్కున్నారు. విలువైన డాక్యుమెంట్లు, నామినేషన్ పత్రాలు లాక్కున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. రాష్ట్రంలో రూల్స్ ప్రకారం పాలన సాగడం లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదన్నారు.
దళితులు, మహిళలకు భద్రత ఏది?. దౌర్జన్యం జరుగుతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడటం తప్పు. ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా తీసుకునే పరిస్థితి లేకపోతే ఎలా?. ఏపీలో ఎమర్జన్సీ పాలన జరుగుతోంది. దళిత మహిళపై జరిగిన దాడికి ప్రభుత్వం.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. రామకుప్పం ఎన్నికను వాయిదా వేయాలి. ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఎన్నిక వాయిదా వేయకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.
మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..‘ఎస్సీ మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తేనే భయపడుతున్నారు. ఎందుకు అంత భయం. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమా?. దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. ఏదో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రామకుప్పం ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి. శ్రీదేవి నామినేషన్ స్వీకరించాలి. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు.