మోసపోయాం.. డబ్బులు ఇప్పించండి | PA Gopal Singh Gharana fraud in the name of jobs | Sakshi
Sakshi News home page

మోసపోయాం.. డబ్బులు ఇప్పించండి

Aug 3 2025 5:50 AM | Updated on Aug 3 2025 5:50 AM

PA Gopal Singh Gharana fraud in the name of jobs

బందరు ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద తమకు ఇచ్చిన ఫేక్‌ లెటర్లను చూపుతూ బాధితుల నిరసన

నిరుద్యోగులను నిలువునా ముంచిన ఎంపీ బాలశౌరి పీఏ

ఉద్యోగాల పేరిట పీఏ గోపాల్‌సింగ్‌ ఘరానా మోసం

60 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.కోటి వసూలు

ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఆశతో డబ్బులు ఇచ్చామంటున్న బాధితులు

చిలకలపూడి/కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం): ఉద్యోగాలు ఇప్పిస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరిట ఆయన పీఏనే నిరుద్యోగులను మోసగించిన ఉదంతం శనివారం వెలుగుచూసింది. ఎంపీ బాలశౌరి కార్యాలయ పీఏ గోపాల్‌సింగ్‌ సుమారు 60 మంది నిరుద్యోగులను నకిలీ నియామక పత్రాలతో బురిడీ కొట్టించి దాదాపు రూ.కోటి వసూలు చేసినట్టు తెలుస్తోంది.

అతడి చేతిలో మోసపోయిన బాధితులంతా శనివారం ఎంపీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీనిపై ఎంపీ బాలశౌరి గాని, ఎంపీ కార్యాలయ ప్రతినిధులు గాని వివరణ ఇవ్వకపోవటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఎంపీ బాలశౌరి కార్యాలయ పీఏ గోపాల్‌సింగ్‌ ఎంపీ కోటాలో ఉద్యోగాలు ఉంటాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ.లక్షన్నర, రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. అనంతరం కృష్ణా యూనివర్సిటీ, డీఎంహెచ్‌ఓ, విద్యుత్‌ శాఖల పేరుతో నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. 

ఆ పత్రాలు తీసుకుని నిరుద్యోగులు ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా ఉండేందుకు రోజూ వారికి అందుబాటులో ఉంటూ ఇంకా చాలామందికి నియామకాలు ఇచ్చారని, వారితో కలిపి మీరు కూడా ఒకేరోజు జాయిన్‌ కావాల్సి ఉంటుందని చెబుతూ వచ్చాడు.

నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో..
డబ్బులు ఇచ్చిన నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎదురవటంతో జూలై 29న వారందరినీ విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో రిపోర్టు చేయాలని, అక్కడ పోస్టింగ్‌ ఇస్తారని గోపాల్‌సింగ్‌ పంపించాడు. వారంతా ఆ హోటల్‌కు వెళ్లగా.. అలాంటి కార్యక్రమం ఏమీ లేదని హోటల్‌ ప్రతినిధులు చెప్పటంతో అవాక్కయ్యారు. వారంతా గోపాల్‌సింగ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది.

అనంతరం బాధితులు విజయవాడలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి జరిగిన మోసాన్ని వివరించారు. గోపాల్‌సింగ్‌ మచిలీపట్నంలో ఉంటాడని అక్కడ సంప్రదించాలని అక్కడివారు చెప్పగా.. బాధితులు మచిలీపట్నంలోని గోపాల్‌సింగ్‌ ఇంటికి వెళ్లారు. గోపాల్‌సింగ్‌ ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, అత్త, మామను నిలదీశారు. రెండు రోజుల నుంచి గోపాల్‌సింగ్‌ ఇంటికి రావటం లేదని అతని భార్య చెప్పింది.

ఆమెతో కలిసి బాధితులు అదేరోజు మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి అక్కడి వారికి విషయం చెప్పారు. ఎంపీ అనుచరులు రెండు రోజుల సమయం కావాలని, సొమ్ము తిరిగి ఇప్పిస్తామని హామీ ఇవ్వటంతో బాధితులు వెళ్లిపోయారు. శనివారం మరోసారి ఎంపీ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి తాళాలు వేసి ఉండటంతో ఎంపీ అనుచరుడిని ఫోన్‌ద్వారా సంప్రదించగా.. గోపాల్‌సింగ్‌ను చిలకలపూడి పోలీసులు అరెస్టు చేశారని అక్కడకు వెళ్లాలని సూచించడంతో బాధితులంతా నిరసనకు దిగారు.

ఇంకెవరి హస్తమైనా ఉందా!
ఉద్యోగాలు పేరిట మోసగించిన ఘటనకు గోపాల్‌సింగ్‌ ఒక్కడే బాధ్యుడా లేక కార్యాలయానికి సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ బాలశౌరి లెటర్‌ హెడ్‌పై ఉద్యోగాలకు రికమెండ్‌ చేస్తూ లెటర్లు ఇవ్వటం చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక మరికొందరి హస్తం ఉండి ఉంటుందని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇంగ్లిష్‌లో జాయినింగ్‌ లెటర్లు ఇచ్చేంత విద్యార్హత గోపాల్‌సింగ్‌కు లేదని బాధితులు పేర్కొంటున్నారు.

గోపాల్‌సింగ్‌పై కేసు నమోదు
ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పీఏగా పనిచేస్తున్న గోపాల్‌సింగ్‌పై చిలకలపూడి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎంపీకి పర్సనల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాల్‌సింగ్‌ జిల్లాలోని అవనిగడ్డ, గుడివాడ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల డబ్బులు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు గోపాల్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎస్‌కే నబీ తెలిపారు.

పోలీసులపై నమ్మకం లేదు
భర్త లేకపోయినప్పటికీ స్వశక్తితో పిల్లలను చదివిస్తున్నాను. నా కుమారుడికి ఉద్యోగం వస్తే అండగా ఉంటాడని భావించి గోపాల్‌సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలకడంతో అప్పులు తెచ్చి డబ్బులు కట్టాం. ఆ డబ్బులు ఉంటే మా అమ్మాయికి మూడు సంవత్సరాల  ఇంజినీరింగ్‌ ఫీజుకు ఉపయోగపడేవి. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోలీసులకు ఫిర్యాదులు చేస్తే అతని వద్ద డబ్బులు ఉంటే రికవరీ చేసి ఇప్పిస్తామంటున్నారు. మాకు పోలీసులపై నమ్మకంలేదు. 
ఎంపీ బాలశౌరి న్యాయం చేయాలి. – సాయిలత, బాధితురాలు, గుడివాడ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement