
యోగాపై అవగాహన పెంచాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నెల రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించా లని, ఉద్యోగులు, సిబ్బంది యోగా సాధన చేయాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. టెలికాన్ఫరెన్స్‌లో విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్డీఓలు కె.చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కార్పొరేట్లకు సాగిల పడుతున్న పాలకులు
కంకిపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు సాగిల పడుతూ ఊడిగం చేస్తున్నా యని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు విమర్శించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కంకిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మిక, కర్షక వర్గాలు ఐక్యమై హక్కులు, చట్టాలను సాధించుకునేందుకు ఉద్యమిస్తున్నాయన్నారు. విద్యారంగంలో సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆందో ళనబాట పట్టాయని స్పష్టంచేశారు. కనీస వేతనం అమలుచేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నిరసన అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అప్పగించారు. వివిధ ప్రజా సంఘాల మండల బాధ్యులు తాడంకి నరేష్, జి.కుమారి, వి.శివశంకర్, వి.జాన్‌మోజేస్, వి.మరియదాసు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

యోగాపై అవగాహన పెంచాలి