
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
గుణదల(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాధికారమే ధ్యేయంగా ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. గుణదలలోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని కనుమరుగు చేసి ప్రజా స్వామ్యాన్ని హరించే దిశగా కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెగబడిందన్నారు. జిల్లాలోని తిరువూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎన్నిక వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తప్పుదారి పట్టింస్తోందన్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లకు మద్దతు ప్రకటించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులం వెళ్తుండగా వంద లాది మంది టీడీపీ గూండాలు అడ్డగించారని పేర్కొన్నారు. నడిరోడ్డుపై తమ వాహనాలను నిలిపి, తమను చుట్టుముట్టి బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తుందని సూటిగా ప్రశ్నించారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను, ఉద్రిక్త పరిస్థితులను వేదికగా మార్చారని దుయ్యబట్టారు. ఎన్నికల అధికారులను మరోమారు కలసి తమ సమస్యను చెప్పు కొంటామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని దుర్మార్గం
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందామంటున్న కూటమి నేతలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారుడుతనంతో వ్యవహరించారని, ఇది దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ మని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ విమర్శించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కోసం నడిరోడ్డుపై దాదాగిరీ ప్రదర్శించిన కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే టీడీపీ గూండాలకు మద్దతుగా నిలవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.
తిరువూరు చైర్‌పర్సన్ ఎన్నికపై నీచరాజకీయాలు దౌర్జన్యాలు, దాడులకుతెగబడిన టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్