
గ్రంథాలయాలు మనో వికాస కేంద్రాలు
విజయవాడకల్చరల్: గ్రంథాలయాలు మనోవికాస కేంద్రాలని ఏపీ గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర సంచాలకుడు కృష్ణమోహన్ అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, గ్రంథాలయ పునర్వికాస వేదిక, స్వేచ్ఛ ఆంధ్ర ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించే గ్రంథాలయ వర్క్‌షాప్‌ను గవర్నర్‌పేటలోని బుక్‌ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో ఆయన మంగ ళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బాలబాలికలకు నిత్య పఠనాన్ని అలవాటు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో గ్రంథాలయాలను విద్యార్థులు సందర్శించాలన్నారు. గ్రంథాలయాల కోసం కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ ఉద్యమనేత గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రంథాలయ పునర్వికాసానికి గ్రంథా లయ పునర్వికాస వేదిక ద్వారా కృషి చేస్తున్నామని, ప్రజలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు సహకరించాలని కోరారు. గ్రంథాలయ పునర్వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల పూర్వవైభవం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పిల్లల ఠాగూర్ గ్రంథాన్ని కృష్ణమోన్ ఆవిష్కరించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యవర్గసభ్యులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎమెస్కో లక్ష్మీ, పల్లవి వెంకటనారాయణ, అరణ్‌కుమార్, జేసీ ప్రసాద్, నవరత్న రవి, సుబ్బరామయ్య, శైలజామూర్తి, నాగిరెడ్డి పాల్గొన్నారు.