
అమ్మ భూమిపై విచారణలో జాప్యం
కంకిపాడు: అమ్మవారి భూమి అన్యాక్రాంతం వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూ ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చి రోజులు గడిచిపోతున్నా విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవదాయశాఖ అధికారులు ఇంకా విచారణ సాగిస్తున్నారు. రెవెన్యూ రికార్డులతో పాటుగా కన్యకా పరమేశ్వరి సత్రానికి చెందిన దస్తావేజులు, రికార్డులను సైతం పరిశీలన చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని పరిరక్షించటంలో తాత్సారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామ పరిధిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుమారు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెంచరు వేస్తోంది. దీనికి సరైన రహదారి సదుపాయం లేకపోవటంతో సమీపంలోని మరో వెంచరు నిర్వాహకులతో మాట్లా డుకుని అందులో నుంచి తమ వెంచరులోకి దారి ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 20 సెంట్లకు పైగా భూమిలో రోడ్డు నిర్మించారు. ఈ దారి నిర్మాణమే వివాదాస్పదమైంది. దారి నిర్మించిన భూమి దేవదాయశాఖ పరిధిలోనిదని కొందరు, కన్యకాపరమేశ్వరి సత్రానికి చెందిన భూమని మరి కొందరు చెబుతున్నారు.
ఫిర్యాదులతో వెలుగులోకి..
నెప్పల్లి గ్రామానికి చెందిన కొందరు ఈ భూమి అన్యాక్రాంతం అవుతోందంటూ కృష్ణా జిల్లా కలెక్టరు సహా దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో భూమి అన్యాక్రాంతం వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఈనెల 7న ‘అమ్మవారి భూమి అన్యాక్రాంతం’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో దేవదాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామంలోని సర్వే నంబరు 101లో ఉన్న 4.41 ఎకరాల భూమి ఉందని తేలింది. ఈ భూమి ఆర్‌ఎస్‌ఆర్‌లో విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి చెందినదిగా ఉంది. అడంగల్‌లో మాత్రం కన్యకాపరమేశ్వరి సత్రం భూమిగా నమోదైంది. రెండు రికార్డుల్లో రెండు విధాలుగా ఎందుకు నమోదై ఉంద న్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. భూ వివాదం వెలుగులోకి వచ్చాక, ఎకరాకు రూ.200 చొప్పున సత్రం కన్యకాపరమేశ్వరి సత్రం నిర్వాహకులు తహసీలు చెల్లించారు. వివాదం తేలే వరకూ ఉండకుండా సత్రం నిర్వాహకులు నుంచి రెవెన్యూ అధికారులు తహసీలు వసూలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెప్పల్లి భూ వివాదానికి తెరపడేదెప్పుడో? నేటికీ కొనసాగుతున్న వెంచరు పనులు రికార్డుల పరిశీలనలో దేవదాయ శాఖ ఉత్సవాల నిర్వహణకు భూమి అప్పగించారంటున్న సత్రం నిర్వాహకులు
భూమిని పరిరక్షిస్తాం
వివాదాస్పద భూమిని కచ్చితంగా పరిరక్షిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చర్యలను అడ్డుకుంటాం. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నాం. సమస్య జిల్లా కలెక్టరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంది. సత్రం నిర్వాహకులు కూడా కొన్ని వివరాలను అధికారులకు అందించారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. భూమిని అన్యాక్రాంతం కానివ్వబోం.
– నూతక్కి వెంకట సాంబశివరావు, ఏసీ, దేవదాయశాఖ, కృష్ణాజిల్లా
రూ.కోట్ల విలువైన భూమికి రక్షణ లభించేనా?
కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమికి రక్షణ లభించేనా అన్న అనుమానాలు నెప్పల్లి గ్రామస్తులు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నెప్పల్లి పరిసరాల్లో ఎకరం భూమి విలువ రూ.5 కోట్ల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన 4.41 ఎకరాల విలువ రూ.20 కోట్లు పైగా పలుకుతుంది. కోటి రూపాయల విలువైన దేవదాయ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచరు నిర్వాహకులు రోడ్డు నిర్మించి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గం గుండానే వెంచ రులోకి అవసరమైన నిర్మాణ సామాగ్రిని తర లిస్తూ దర్పం ప్రదర్శిస్తున్నారు. భూమి వ్యవహారం తేలే వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులను కట్టడి చేయటం, భూమిని స్వా ధీనం చేసుకునే ప్రక్రియలో అధికారులు మెతకవైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూమి లీజు కేటాయింపులు అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి ఎలా దక్కాయన్నది కూడా ప్రశ్నగానే మిగిలింది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన దేవదాయ శాఖ అధికారులు మాత్రం రోడ్డు నిర్మాణం అక్రమమేనని, పరిరక్షిస్తామని చెబుతున్నారు. సత్రం నిర్వాహకులు మాత్రం తమకు ఈ భూమిని ఉత్సవాల నిర్వహణకు ఏళ్లనాడు అప్పగించారంటూ కలెక్టరుకు సమర్పించిన నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

అమ్మ భూమిపై విచారణలో జాప్యం