రాష్ట్ర క్రీడా ఖ్యాతిని చాటిన స్కేటర్ కై వల్య
శాప్ చైర్మన్ రవినాయుడు
విజయవాడస్పోర్ట్స్: తైవాన్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ తైవాన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో విజయవాడ క్రీడాకారుడు కొప్పవరపు కై వల్య ఐదు పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచాడని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల యూత్ ఫ్రీ స్టయిల్, ఇన్‌లైన్, సోలో డ్యాన్స్, పెయిర్ స్కేటింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, కపుల్ డ్యాన్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కైవల్యను శాప్ కార్యాలయంలో చైర్మన్ రవి నాయుడు బుధవారం దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి అతని క్రీడా నైపుణ్యాన్ని కొనియాడారు. భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుల్లో కైవల్య అత్యధికంగా 275.5 పాయింట్లు సాధించి అగ్రగామిగా నిలిచాడని తెలిపారు. తైవాన్, జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా, సింగపూర్, అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ఓవరాల్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమ డింపజేసిన కై వల్యను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని యువతకు సూచించారు. ఇదే క్రీడా స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు. క్రీడాకారుడు కై వల్యను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి నరేష్‌శర్మ, భారత ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ ప్రదీప్ మాల్వాయ్, ఏపీ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ ఆకుల పవన్‌కుమార్, కోచ్ పి.సత్యనారాయణ అభినందించారు.


