నాన్న ఇంత దారుణానికి పాల్పడతాడనుకోలేదు
పెనమలూరు: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు.
నన్ను కూడా చంపాలని చూశారు...
తన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు.
రసవత్తరంగా కబడ్డీ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సీతారామ గార్డెన్స్ ఆవరణలో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా శనివారం ప్రీ–క్వార్టర్ ఫైనల్ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. తొలుత కబడ్డీ క్రీడాకారులను రైల్వే క్‌లైమ్స్ ట్రిబ్యునల్ అడిషనల్ డైరెక్టర్ కె.రాజేంద్రప్రసాద్ పరిచయం చేసుకుని పోటీలను వీక్షించారు. శనివారం సాయంత్రం జరిగిన ప్రీ–క్వార్టర్ ఫైనల్ పోటీల్లో హర్యానా టీమ్ 58 పాయింట్లు సాధించగా ఆంధ్ర జట్టు కేవలం 27 పాయింట్లు సాధించి పరాజయం పాలైంది. చండీఘర్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన పోటీలో చండీఘర్ జట్టు–52, మధ్యప్రదేశ్ జట్టు–40 పాయింట్లు సాధించగా చండీఘర్ జట్టు విజయం సాధించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్–73 పాయింట్లు సాధించగా పంజాబ్ కేవలం 30 పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. చత్తీస్‌ఘడ్, ఉత్తరాంచల్ జట్ల మధ్య జరిగిన రసవత్తర పోటీలో చత్తీస్‌ఘడ్–51, ఉత్తరాంచల్–50 పాయింట్లు సాధించాయి. ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఛత్తీస్‌ఘడ్ విజయాన్ని కై వసం చేసుకుంది. గోవా, కర్ణాటక జట్ల మధ్య, తమిళనాడు, మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా జరిగాయి.
22 నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి 26వ వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం బ్రహ్మోత్సవ వివరాలు వెల్లడించారు. ఈనెల 22వ తేదీ మాఘ శుద్ధ చవితి గురువారము ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరిస్తారని తెలిపారు. అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు శేషవాహనంపై రావివారిపాలెం గ్రామం వరకు గ్రామోత్సవము, రాత్రి 7 గంటలకు ఎదురుకోలు ఉత్సవం, రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య కల్యాణ మహోత్సం జరుగుతాయని తెలిపారు. అనంతరం నంది వాహనముపై గ్రామోత్సవం నిర్వహిస్తారన్నారు. 24వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవం, 26వ తేదీ రాత్రి 7 గంటలకు స్థానిక పుష్కరిణిలో శ్రీస్వామివార్ల తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు దేవాలయంలో నిత్య ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
నాన్న ఇంత దారుణానికి పాల్పడతాడనుకోలేదు


