కోనేరుసెంటర్: మచిలీపట్నంలో ఈ నెల 21వ తేదీన జరిగిన వీర్నాల శ్రీనివాసరావు అలియాస్ టోపీ శ్రీను హత్య కేసును బందరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా నిర్ధారించారు. హత్యలో దాదాపు 10 మంది పాల్గొన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిలో తొమ్మిది మందిని బుధవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బందరు డీఎస్పీ సీహెచ్ రాజా ఇనకుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన వీర్నాల శ్రీను వ్యాను డ్రైవర్‌గా పనిచేయటంతో పాటు సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సుంకర ఉదయ వెంకటరమణ, శ్రీను స్నేహితులు. వెంకటరమణ హోంగార్డుగా పని చేస్తుండగా పలు ఆరోపణల కారణంగా అధికారులు అతన్ని హోంగార్డు ఉద్యోగం నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా రమణ ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వర్రేగూడెంలో కాపురం ఉంటుండగా మృతుడు శ్రీను రమణ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రమణ పలుమార్లు శ్రీనును హెచ్చరించడమే కాక ఘర్షణ పడి దాడి చేశాడు. దీంతో ఇనకుదురుపేట పోలీసులకు శ్రీను ఫిర్యాదు కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే రమణ భార్య శ్రీనుతో వేరే ఇంట్లో కాపురం పెట్టింది. అవమానం తట్టుకోలేని రమణ కొంతకాలం క్రితం హైదరాబాదు వెళ్లిపోయాడు. అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. పది రోజుల క్రితం మచిలీపట్నం వచ్చాడు. 21వ తేదీన వర్రేగూడెంలోని మీసేవ సెంటర్‌కు సమీపంలోని వాటర్‌ట్యాంకు వద్ద రమణతో పాటు అతని మేనల్లుడు మెరుగు రోహిత్, చిన మేనమామ మెరుగు నాగదుర్గాప్రసాద్, స్నేహితులైన షేక్ సాజీద్ అలియాస్ సజ్జు, మహమ్మద్ ఘాజీ అబ్బాస్ అలియాస్ గౌస్య, ఇలియాస్ అలియాస్ అంబటి, వైశెట్టి శ్రీవాసు అలియాస్ వాసు, షేక్ రెహమాన్ అలియాస్ బుడా, బడే పూర్ణచంద్రరావు అలియాస్ పూర్ణ కలిసి మద్యం తాగుతున్నారు. అదే సమయంలో మృతుడు శ్రీను అతని స్నేహితుడు దుర్గా అనే వ్యక్తితో కలిసి అక్కడికి వెళ్లాడు. శ్రీనుని చూసిన రమణ ఆగ్రహంతో ఊగిపోయాడు. గతం గుర్తు చేసుకుని శ్రీనుతో గొడవకు దిగాడు. రమణకు తోడు మేనల్లుడు రోహిత్, మేనమామ దుర్గాప్రసాద్, మిగిలిన స్నేహితులు శ్రీనుతో గొడవకు కాలు దువ్వటంతో రమణ అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో శ్రీను తలపై గట్టిగా కొట్టాడు. అడ్డు వచ్చిన స్నేహితుడు దుర్గా తలపై బాదాడు. దీంతో దుర్గా అక్కడి నుంచి పారిపోగా రమణ, రోహిత్, దుర్గాప్రసాద్ క్రికెట్‌బ్యాట్, రాడ్లు, కర్రలతో శ్రీనుపై మూకుమ్మడి దాడి చేసి తలపై బలమైన దెబ్బలు కొట్టారు. దీంతో శ్రీను తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీను చనిపోవటంతో అందరూ అక్కడి నుంచి పారిపోయారు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న ఇనకుదురుపేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతుని వివరాలతో పాటు హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. హత్య చేసింది రమణ అని తెలుసుకున్న పోలీసులు మృతుని భార్య వీర్నాల రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు స్వయంగా పరిశీలించటంతో పాటు హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు బుధవారం మధ్యాహ్నం రమణతో పాటు హత్యలో పాల్గొన్న అతని మేనల్లుడు, మేనమామ, హత్యకు సహకరించిన మిగిలిన స్నేహితులను చిన్నాపురం రోడ్డులోని టిడ్కో గృహాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న హంతకులను కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసును ఛేదించటంలో ప్రతిభ కనబరచిన పోలీసులను ఎస్పీ అభినందించినట్లు చెప్పారు. సమావేశంలో ఇనకుదురుపేట సీఐ పరమేశ్వరరావు, ఎస్‌ఐ బేగ్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు రోజుల్లోనే హంతకులను పట్టుకున్న పోలీసులు
ఇనకుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ


