
కళాశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్
చాలా సంతోషంగా ఉంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా మెడికల్ కళాశాల ప్రారంభం కానుండటం సంతోషదాయకం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశాం. 150 సీట్లకు గానూ ఇప్పటి వరకు 118 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లు మొత్తం పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాం.
– డాక్టర్ కె. విజయకుమారి, ప్రిన్సిపాల్
ఆశ్చర్యం కలిగించింది
ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రవేశించిన వెంటనే నూతన హంగులతో తీర్చిదిద్దన భవనాలు, తరగతి గదులను చూసి ఆశ్చర్యం కలిగించింది. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఈ కళాశాలను తీర్చిదిద్దారు. వసతి గృహంలో మంచి సౌకర్యాలు కల్పించారు. నాణ్యమైన ఆహారం పెడుతున్నారు. ఇన్ని సౌకర్యాలు ఉంటాయని నేను ఊహించలేదు.
– జి. అభిషేక్, మెడిసిన్ విద్యార్థి, తణుకు
భవిష్యత్తు బాగుంటుంది
ఎన్నో సంవత్సరాల తర్వాత బందరు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. దీనికి ఈ మెడికల్ కళాశాల ఒక నిదర్శనం. వైద్య కళాశాల ఏర్పాటుతో మరో మెట్టు ఎక్కినట్టే. ఇది ఎంతో ఆనందదాయకం, గర్వించదగ్గ విషయం. ఏటా 150 మంది వైద్యులను దేశానికి అందించటం బందరు ఖ్యాతిని ఇనుమడింపజేస్తుంది.
– బి. శ్రీనివాసాచార్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): భారతదేశంలోనే అతిపురాతన మునిసిపాలిటీగా పేరొందిన బందరుకు పాలకులు ఎంత మంది మారినా ఇప్పటి వరకు ఎలాంటి మార్పూ లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో బందరు ప్రాంతానికి ఉన్నత స్థాయి సంస్థలు అనేకం వస్తుండటంతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణంతో పాటు హార్బర్ నిర్మాణ పనులు ఇప్పటికే కోట్లాది రూపాయలతో పనులు జరుగుతుండగా.. ఇప్పటికే పూర్తయిన మెడికల్ కళాశాల నిర్మాణం బందరు ప్రాంతానికి తలమానికం కానుంది.
65 ఎకరాల విస్తీర్ణంలో..
కళాశాల నిర్మాణానికి రూ. 325 కోట్లను ప్రభుత్వం వెచ్చిచింది. మచిలీపట్నంలోని కరగ్రహారంలో సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఏడు బ్లాక్‌లలో అడ్మినిస్ట్రేటివ్, ల్యాబ్‌లు, తరగతి గదులు, డిపార్ట్‌మెంటల్ బ్లాక్, ఎగ్జామినేషన్ బ్లాక్, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాలు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తి కావటంతో ఈ ఏడాది అకడమిక్ ఇయర్‌కు సంబంధించి 150 ఎంబీబీఎస్ సీట్లకు గానూ 118 సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి. ఇటీవల ఆలిండియా కోటాలో మరో ఐదు సీట్లు భర్తీ కాగా ఈ మాసంలో ప్రారంభం కానున్న రెండో విడత కౌన్సెలింగ్‌తో మిగిలిన సీట్లు మొత్తం భర్తీ చేసేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. వసతి గృహంలో ఇప్పటి వరకు చేరిన విద్యార్థుల్లో బాలురు –22, బాలికలు –28 మంది ఉంటున్నారు. వీరికి అధునాతన బెడ్లతో పాటు బీరువాలు, రీడింగ్ టేబుల్స్ ఏర్పాటుతో పాటు బాత్‌రూమ్‌లలో గీజర్, వాషింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ..
మచిలీపట్నం ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రవేశించిన విద్యార్థులకు పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించేందుకు ఫ్యాకల్టీ నియామకం పూర్తయ్యింది. మొదటి సంవత్సరానికి సంబంధించి ఏడుగురు ప్రొఫెసర్లు, 19 మంది అడిషనల్ ప్రొఫెసర్లు, 34 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. శుక్రవారం నుంచి తరగతులు పూర్తిస్థాయిలో నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన విజయనగరం మెడికల్ కళాశాలను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి పర్చువల్ పద్ధతిలో మచిలీపట్నంలోని మెడికల్ కళాశాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మెడిసిన్ చదివేందుకు చేరిన విద్యార్థులతో మాట్లాడనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజితాసింగ్ గురువారం ఉదయం మెడికల్ కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్ కళాశాల ప్రాంగణం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహా ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏర్పాట్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించి చర్చించారు.
బందరుకు తలమానికంగా మెడికల్ కళాశాల
నేడు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కార్యక్రమానికి హాజరుకానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు పరిశీలించిన కృష్ణా జేసీ అపరాజితాసింగ్


