
ఆటోనగర్(విజయవాడతూర్పు): స్నేహితులతో కలిసి నీటిలో కాగితం పడవలు వదులుతూ కేరింతలు కొట్టిన చిన్నారిని చూసి విధి పగ బట్టిందో ఏమో డ్రెయి న్‌లో ముంచి ప్రాణాలను బలిగొంది. తల్లిదండ్రులకు నూరేళ్లకు సరిపడా కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన విజయవాడ నాలుగో డివిజన్, సీటీఓ కాలనీలో ఎన్‌ఏసీ కల్యాణ మండపం వెనుక శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా శ్రీరామవరం గ్రామానికి చెందిన టేకు వీరబాబు, నూకరత్నం దంపతులు బతుకుదెరువు కోసం ఇద్దరు కుమారులతో నగరానికి వలస వచ్చారు.
సీటీఓ కాలనీలో ఎన్‌ఏసీ కల్యాణ మండపం వెనుక నివసిస్తున్నారు. పెద్దకుమారుడు (6) కల్యాణ మండపం వెంబడి ఉన్న అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి కాగితం పడవలను మురుగునీటిలో వదులుతూ ఆడుకున్నారు. పడవలను నీటిలో వదిలే క్రమంలో అభిరామ్ కాలుజారి డ్రెయిన్‌లో పడ్డాడు. తోటిపిల్లలు వెంటనే అభిరామ్ డ్రెయిన్‌లో పడిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వీరబాబు, నూకరత్నం దంపతులు ఆందోళనతో డ్రెయిన్ వద్దకు ఒక్క పరుగున వచ్చారు. స్థానికులు డ్రెయిన్‌లో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.
డ్రెయిన్‌లో బాలుడి గల్లంతు సమాచారం తెలుసుకున్న పటమట పోలీ సులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అభిరామ్ కోసం జల్లెడపట్టారు. మురుగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో చిన్నారి ఆచూకీ లభించలేదు. మూడున్నర గంటల గాలింపు అనంతరం భారతీనగర్ టవర్ లైన్‌లో డ్రెయిన్‌లో బాలుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి మృతితో వీరబాబు, నూకరత్నం దంపతులు భోరున విలపించారు. పటమట సీఐ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మేయర్
స్ట్రామ్ వాటర్ డ్రెయిన్‌లో బాలుడు గల్లంతైన విషయం తెలుసుకున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పలువురు అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం క్రేన్, భారీ యంత్రాలను తెప్పించారు. బాలుడు మృతిచెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లి నూకరత్నం, తండ్రి వీరబాబును ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కాగితం పడవలతో
ఆడుకుంటూ నీటిలో పడిన బాలుడు
బాలుడి ఆచూకీ కోసం
మూడున్నర గంటలపాటు గాలింపు
భారతీనగర్ వద్ద బాలుడి
మృతదేహం వెలికితీత
ఘటనా స్థలానికి చేరుకుని
బాధితులను ఓదార్చిన మేయర్