పత్తికే ప్రాధాన్యం! | - | Sakshi
Sakshi News home page

పత్తికే ప్రాధాన్యం!

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

సీజన్‌ ఆరంభంలో జాడలేని వర్షాలు ఆరుతడి పంటల వైపు రైతుల మొగ్గు పెరిగిన సోయా, పెసర, మినుము పంటలు తగ్గిన వరి సాగు విస్తీర్ణం

దహెగాం: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వరితో పోలిస్తే అత్యల్ప నీటితో పండించే పంటలను సాగు చేయాలని సలహాలు, సూచనలు అందించారు. దీంతో రైతులు ఆరుతడి పంటలైన ఆహారధాన్యాల సాగు వైపు మొగ్గు చూపారు. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు తగ్గి పత్తి సాగు పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందువల్ల రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలవైపు దృష్టి సారించాలని సూచించడంతో రైతులు వరి సాగును తగ్గించారు.

జిల్లాలో సాగు విస్తీర్ణం 4,52,317 ఎకరాలు

జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 4,52,317 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉన్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అందులో ప్రధానంగా పత్తి, వరి సాగు అధికంగా ఉంది. సీజన్‌ ఆరంభంలో వర్షాలు కురియక పోవడంతో రైతులు ఆందోళన చెందారు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తి విత్తుకున్నారు. ప్రారంభంలో పత్తిలో ఎదుగుదల లోపించినా ఆగస్టులో కురిసిన వర్షాలు పంటలకు ప్రాణం పోసినట్లయింది. జూన్‌, జూలై మాసాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి వరదనీరు చేరలేదు. దీంతో ఆయకట్టు కింద వరి సాగు ఆలస్యమైంది. ఆగస్టులో భారీ వర్షాలు కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో వరి సాగు పనులు ముమ్మరం చేశారు.

తగ్గిన వరి సాగు..

జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది 56 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా ఈసారి 35,452 ఎకరాల్లో మాత్రమే సాగైనట్లు వ్యవసాయాధికారుల గణంకాలు చెబుతున్నాయి. గతేడాది పత్తి 3.35 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 3.77 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ ఏడాది కంది, జొన్న సాగు సైతం తగ్గగా సోయాబీన్‌, పెసర, మినుముల సాగు పెరిగింది. ప్రధానంగా జిల్లాలో పత్తి సాగు అధికంగా పెరిగింది.

వర్షపాతం సాధారణమే..

ఇప్పటి వరకు జిల్లాలో 849.7 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 836.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వ్యత్సాసం – 2.0 సాధారణంగా ఉంది. కాగజ్‌నగర్‌లో –10.0, చింతలమానెపల్లిలో 20 లోటు, దహెగాంలో –10.0, కౌటాలలో – 14.0 వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గతేడాది ఆగస్టు 31 నాటికి 849.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 987.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరికి బదులు జొన్న..

వరి సాగు సమయం మించిపోయింది. రైతులు జొన్న సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఎకరాకు 20 క్వింటా ళ్ల దిగుబడి వస్తుంది. జొన్నకు గిట్టుబాటు ధర రూ.3,700 ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంతో వరి సాగు తగ్గి పత్తి సాగు పెరిగింది. – వెంకట్‌, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో ప్రాజెక్టులు నీటి నిల్వ (టీఎంసీల్లో)

జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)

మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం

జైనూర్‌ 897.9 873.7 –3.0

సిర్పూర్‌(యు) 884.2 844.6 –4.0

లింగాపూర్‌ 847.1 889.1 5.0

తిర్యాణి 738.7 832.3 13

రెబ్బెన 730.4 728.6 0.0

ఆసిఫాబాద్‌ 756.6 729.9 5.0

కెరమెరి 756.5 879.4 16.0

వాంకిడి 807.9 795.1 –2.0

కాగజ్‌నగర్‌ 773.0 694.0 –10.0

సిర్పూర్‌(టి) 885.3 813.4 –8.0

కౌటాల 928.2 801.4 –14.0

చింతలమానెపల్లి 926.7 745.4 –20.0

బెజ్జూర్‌ 985.0 1024.9 4.0

పెంచికల్‌పేట్‌ 905.5 999.6 10.0

దహెగాం 922.1 829.4 –10.0

ప్రాజెక్టు నిల్వ ప్రస్తుతం

సామర్థ్యం నీటి నిల్వ

వట్టివాగు 2.89 2.721

కుమురంభీం 10.39 6.001

ఎన్టీఆర్‌ సాగర్‌ 0.37 0.37

జగన్నాథ్‌పూర్‌ 0.135 0.107

పీపీరావు 0.848 0.860

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement