మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికే ఒక మోడల్ అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మేయర్ దర్ని మధుకర్‌తో కలిసి మాట్లాడారు. మంచిర్యాల పట్టణ ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూనే స్థానిక ఎమ్మెల్యే సంకల్పం, నిబద్ధత వల్లే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల మోడల్‌ను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను ఇక్కడికి పంపించి, ఈ అభివృద్ధిని ఒక మోడల్‌గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించానన్నారు. ఇక్కడి 50 పడకల ఆస్పత్రి, ఆర్కిటెక్చర్, విశాలమైన వరండాలు, గాలి వెలుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి, పరిశీలనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ వారిని ఇక్కడికి పంపించామన్నారు. తాను ఆదిలాబాద్ నుంచి పాతయాత్ర చేపట్టిన సమయంలో ప్రేమ్‌సాగర్‌రావు, కొక్కిరాల సురేఖ, శ్రీధర్‌బాబు తన వెనకుండి ముందుకు నడిపించారన్నారు.


