రెండో విడతలో నాలుగు వేల ఇళ్లు
త్వరలో మండలాలకు కేటాయింపు
జిల్లాలో ప్రారంభం కానున్న సర్వే
గ్రామసభల ద్వారానే ఇళ్ల పంపిణీ
నెరవేరనున్న పేదల సొంతింటి కల!
కెరమెరి: మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని అర్హులు రెండో విడతపై గంపెడాశలు పెట్టుకున్నారు. రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో సంబురపడుతున్నారు. త్వరలో అధికారులు గ్రామాల్లో సర్వే ప్రారంభించనున్నారు. గతంలోనే దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సేకరించిన అధికారులు తాజాగా మళ్లీ ఆరా తీయనున్నారు.
నియోజకవర్గానికి 2వేల చొప్పున..
జిల్లాలో రెండు నియోజకవర్గాలుండగా ప్రభుత్వం సిర్పూర్(టి) నియోజకవర్గానికి 1,500, ఆసిఫాబా ద్‌కు 1,500 ఇళ్లు మంజూరు చేసింది. అదనంగా పా త ఇందిరమ్మ ఇళ్ల మరమ్మతుకు అనుమతించింది. ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున వెయ్యి మంజూరు చేసింది. మరమ్మతుల పరిస్థితులను పరిశీలించి ఒక్కో ఇంటికి రూ.2లక్షలు మంజూరు చేయనుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికంటే ముందు న్న ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నవారే ఇందుకు అర్హులు. ఆ ఇంటికి రేకులు, లేదా పెంకులు వేసి ఉండాలి. వాటిని తీసేసి స్లాబు వేస్తారు. కానీ, గోడలు గట్టిగా ఉండాలి. లబ్ధిదారు ని అనుమతితో మరమ్మతులు చేస్తారు. మొదటి విడతలో జిల్లాకు 8,850 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా, 758 నిర్మాణాలు పూర్తయ్యాయి. 2,600 వరకు స్లాబ్ దశలో ఉండగా, మిగతావి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
వారంరోజుల్లో మండలాలవారీగా..
నియోజకవర్గాల వారీగా ఇళ్లు మంజూరు కాగా, మండలాలు, గ్రామపంచాయతీల వారీగా ఇంకా కేటాయించలేదు. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత ఇరిగేషన్, వ్యవసాయ, వెటర్నరీ, విద్య తదితర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. సర్వేకు ఎంపికై న అధికారులకు ప్రత్యేక లాగిన్ ఇస్తారు. వారు జాబితాలోని దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. నమోదు చేసిన వివరాలు ఎంపీడీవో లాగిన్‌కు వెళ్తే అక్కడి నుంచి హౌసింగ్ సంస్థకు అనంతరం పీడీ, కలెక్టర్‌కు పంపిస్తారు. గతంలో వచ్చిన దరఖాస్తులను ఎల్–1, ఎల్–2, ఎల్–3గా విభజించారు.
పూరిగుడిసె ఉన్నవారికే ప్రాధాన్యం
జిల్లాలో 65 పీవీటీజీ (ఆదిమ గిరిజనులు)లకు చెందిన గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో సుమారు 5,123 మంది కుటుంబాలున్నాయి. ఇప్పటికే మొదటివిడతలో 2,167 కుటుంబాలకు పీఎం జన్‌మన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మరో 1,931 మంది ఆదిమ గిరిజనుల జాబితాను అధికారులు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. కాగా, ఇటీవల కెరమెరి మండంలోని కొత్తగూడ గ్రామాని కి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మరో 21వేల ఇళ్లను గిరిజనులకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రెండో విడతలో మంజూరైన ఇంది రమ్మ ఇళ్లను పూరి గుడిసె ఉన్నవారికే మొదటి ప్రా ధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు పూరి గుడిసెల వివరాలు సేకరిస్తున్నారు.
త్వరలో సర్వే ప్రారంభిస్తాం
జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు రెండో విడతలో 4వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో వెయ్యి పాత గృహాలకు మరమ్మతులు చేయనున్నాం. పీవీటీజీలందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం. త్వరలో గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే ప్రారంభిస్తాం. పూరి గుడిసెలున్నవారికి ప్రాధాన్యం ఇస్తాం. అధికారులు సర్వే చేశాక ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఇళ్లు మంజూరు చేస్తాం.
– వేణుగోపాల్, హౌసింగ్ డీఈ
కెరమెరి మండలం చిన్నుగూడ గ్రామానికి చెందిన ఈ కొలాం మహిళ పేరు మడావి లక్ష్మి. భర్త రెండేళ్ల క్రితమే ఈమెను వదిలి వెళ్లాడు. కూలీ పనులకు వెళ్లి ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం వీచిన గాలివానకు ఈమె నివాసముండే షెడ్డు రేకులు లేచిపోగా నిరాశ్రయురాలైంది. వాస్తవంగా ఈమెకు పీఎం జన్‌మన్ లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాల్సి ఉంది. కానీ, ఈ గ్రామానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు.


