కరుణించని వరుణుడు! | - | Sakshi
Sakshi News home page

కరుణించని వరుణుడు!

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

● జిల్లాలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం

రుతుపవనాల రాకలో ఆలస్యం!

వర్షాల కోసం కర్షకుల నిరీక్షణ

పత్తి రైతుల్లో మొదలైన ఆందోళన

వాంకిడి: ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆకాశం నల్లబడుతున్నా చినుకులు మాత్రం నేలను తాకడం లేదు. జిల్లాలో ఏటా మృగశిర కార్తె నుంచే వర్షాలు ప్రారంభమయ్యేవి. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చగా సరిపడా వర్షాలు కురవడం లేదు. అక్కడక్కడా స్వల్పంగా చినుకులు పడుతూ.. కమ్ముకున్న కారు మబ్బులు కనుమరుగై క్షణాల్లో ఆకాశం తెల్లబడుతోంది. జిల్లాలో ప్రధాన ఆర్థిక వనరు వ్యవసాయమే కాగా, అత్యధికంగా రైతులు పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మే చివరి వారం నుంచే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేశారు. మరో వైపు స్వల్పంగా వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రైతులు తొందరపడి ఇప్పటికే విత్తనాలు వేస్తున్నారు. కాగా, విత్తనాలు విత్తేందుకు సరిపడా వర్షాలు కురవలేదని అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని, దీంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు, అధికారులు హెచ్చరిస్తున్నారు.

4.52 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో 4.52 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా అత్యధికంగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప త్తి తర్వాత వరి, కంది, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తుండగా రైతులు పంట మార్పిడి విధానం పాటించడం మేలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు. రైతులు నీటి ఆవశ్యకత తక్కువగా ఉండే పంటలకు మొగ్గు చూపాలని ప్రభుత్వాలూ సూచిస్తున్నాయి. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతో అధికారులు, శాస్త్రవేత్తలు సాగులో మెళకువలు, శాసీ్త్రయ విధానం, ఎరువు ల వాడకం, తక్కువ వర్షపాతంలో సాగయ్యే పంటలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.

ఇప్పటివరకు తేలికపాటి వర్షాలే..

రైతులు విత్తనాలు వేసేందుకు తొందరపడొద్దు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. విత్తనం వేయాలంటే కనీసం 50–100 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కావా లని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రతీరోజు కారుమబ్బులు కమ్ముకుంటుండటంతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో విత్తనాలు నాటేస్తున్నారు. అధికశాతం రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తుంటే.. తేలికపాటి చిరుజల్లులు కురిసిన మండలాల ప్రజలు విత్తనాలు నాటేస్తున్నారు. అధికారులు మాత్రం సరిపడా వర్షాల కోసం ఎదురుచూడాలని సూచిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై పడుతున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా సాగునీటి అవసరమున్న వరి, చెరుకు లాంటి పంటలకు బదులుగా ఇతర పంటలు వేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

తొందరపడి విత్తనాలు వేయొద్దు

సరిపడా వర్షాలు కురవలేదు. రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దు. సగటున 50–100 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయ్యాక విత్తనాలు వేయాలి. తొందరపడి వేస్తే మొలకెత్తిన మొక్కలు ఎండిపోతాయి. తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జిల్లాలో ఖరీఫ్‌నకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. నకిలీ విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – జాడి మిలింద్‌కుమార్‌, ఏడీఏ

జిల్లాలో వానాకాలం సాగు అంచనా

సాగు విస్తీర్ణం: 4.52 లక్షల ఎకరాలు

పత్తి సాగు: 3.70 లక్షల ఎకరాలు

కావాల్సిన విత్తనాలు: 7,41,826 ప్యాకెట్లు

యూరియా... : 60,583 మెట్రిక్‌ టన్నులు

డీఏపీ.. : 22,608 మెట్రిక్‌ టన్నులు

నానో యూరియా: 3.70 లక్షల లీటర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement