ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీ యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు కీలక సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా తదితర సదుపాయాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించి, నాలుగు నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలన్నారు. కారో బార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా, కార్మికులందరికీ రూ.10 లక్షల బీమా సౌకర్యం కలించాలని, ప్ర మాద మరణాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందజేశారు. నాయకులు కృష్ణమాచారి, మోరేశ్వర్, పెరిక శ్రీకాంత్, శంకర్, నగేశ్, పుష్పలత, రమేశ్, భాగ్య, రాజమ్మ, లక్ష్మి, భార్గవ్, వసంత్, అజిత్‌ఖాన్, మారుతి తదితరులున్నారు.


