ఇంకా అందని ‘రాజీవ్ యువ వికాసం’ రుణాలు జిల్లాలో 29,756 దరఖాస్తులు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా పంపిణీ చేయని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దరఖాస్తుదారులు
తిర్యాణి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది మే నెలలో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఏడాది కాలం గడిచినా నేటికీ దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు అందించలేదు. దరఖాస్తుదారులకు కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించడం వరకే అధికారులు పరిమితమయ్యారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకుని రూ.4 లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలు కోసం బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలను అందించాల్సి ఉంది. అలాగే రూ.50 వేల యూనిట్‌కు వంద శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం 70 శాతం సబ్సిడీని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రేషన్‌కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు యువ వికాసం పథకం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాలో 29,756 దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 29,756 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేశారు. అధికారులు సంబంధిత బ్యాంకు సిబ్బందితో కలిసి దరఖాస్తుదారులకు గతేడాదిలోనే ఇంటర్వ్యూలను సైతం నిర్వహించారు. దీంతో లబ్ధిదారులలో ఆశలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన 2025 జూన్ 2 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా చేసింది. కానీ సంవత్సర కాలం దాటిపోయినా పథకం ప్రారంభానికి నోచుకోకపోవడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ ఏడాది 2026– 27 ఆర్థిక బడ్జెట్‌లో సైతం రాజీవ్ యువ వికాసం పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,800 కోట్ల నిధులు కేటాయించింది. అయినా లబ్ధిదారులకు రుణాల పంపిణీ చేయడం లేదు. పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులైన వారందరికీ రుణాలు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఆటో కోసం దరఖాస్తు
ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంలో నేను ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నాను. గతేడాది జూన్ 2 నుంచే రుణాలను అందిస్తామని చెప్పారు. కానీ నేటికీ వాటికి సంబంధించిన వివరాలు ఎవరిని అడిగినా చెప్పడం లేదు. ప్రభుత్వం లోన్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్ పూర్తి చేసిన నాకు ఉద్యోగం దొరకకపోవడంతో ప్రైవేటు డ్రైవర్‌గా కాలం వెల్లదీస్తున్నాను.
– మహదేవుని పవన్, గోలేటి, మం.రెబ్బెన
మోసం చేయడం సరికాదు
యువ వికాసం పేరిట రుణాలను ఇప్పిస్తామని చెప్పి దరఖాస్తులను తీసుకున్నారు. ఇప్పుడు రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తూ కాలం గడపడం సరికాదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను దారి మళ్లించడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలయాపన చేయకుండా వెంటనే అర్హులైన నిరుద్యోగులందరికీ బేషరతుగా రుణాలు అందజేయాలి.
– ఇగురపు సంజీవ్,
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి


