ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం, జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేపడుతున్నట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం జాతీయ పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినం ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పల్స్ పోలియో దినం సందర్భంగా ఈ నెల 28న ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో వాక్సిన్(పోలియో చుక్కలు) వేయించాలన్నారు. 46,516 మంది ఐదేళ్లలోపు చిన్నారుల కోసం జిల్లావ్యాప్తంగా 670 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 28న చుక్కలు వేయించుకోలేని వారికి 29, 30వ తేదీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి వేస్తారన్నారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏళ్లలోపు 1,67,702 మంది పిల్లలు, యువతకు అల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నివారణ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్‌వో దాసరి వేణు, డీఎంహెచ్‌వో సీతారాం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎల్ 1 జాబితాలో ఉన్న వారి ఇళ్లను, సామాజిక, ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి గురువారం ఎంపీడీవోలు, సెర్ప్ ఏపీఎం, ఈజీఎస్ ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీల నిర్మాణంపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీవో దత్తారావు, పీడీ ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.


