బాల్య వివాహాలపై సమరం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలపై సమరం

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

బాల్య వివాహాలపై సమరం

బాల్య వివాహాలపై సమరం

బాల్య వివాహ విముక్త్‌ అభియాన్‌కు శ్రీకారం వంద రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం సంచార వాహనం ద్వారా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం

పెంచికల్‌పేట్‌: బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాల్య వివాహ విముక్త్‌ అభియాన్‌కు శ్రీకారం చుట్టాయి. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్‌ 27వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 8 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను గ్రామస్థాయిలో విసృతంగా తెలియజేసేందు కు వంద రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా రెండు రోజుల క్రితం కలెక్టర్‌ హరిత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలిసి సంచార వాహనాన్ని ప్రారంభించారు.

స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లాలో జస్ట్‌ రైట్‌ ఫర్‌ చిల్డ్రన్‌, సొసైటీ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎన్‌లైట్‌మెంట్‌(ఎస్‌యూఆర్‌ఈ) సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే విద్యా సంస్థల్లో సదస్సులు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలికలకు బాల్యవివాహలతో కలిగే అనర్థాలను తెలియజేసేందుకు వ్యాసరచన పోటీలు సైతం నిర్వహించారు. గ్రామాలను బాల్య వివాహ రహితంగా రూపుదిద్దడానికి పంచాయతీల్లో సర్పంచులు, అంగన్‌వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువజన సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన సర్పంచుల శిక్షణ తరగతుల్లో బాల్య వివాహలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. వారితో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మైనర్‌ పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే ఆలయాలు, మసీదులు, చర్చీలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. పురోహితులు, పాస్టర్లు, ఖాజీలకు అవగాహన కల్పించారు.

గ్రామాలకు సంచార వాహనం

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. సరిహద్దు మండలాలతోపాటు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. దీంతో బాలికలు మధ్యలోనే చదువును వదిలేస్తున్నారు. జిల్లాలో గతేడాది జిల్లా అధికారులు 17 బాల్యవివాహాలను అడ్డుకోగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు మూడు మైనర్‌ పెళ్లిలను అడ్డుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, పురోహితులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రస్తుతం శుభ ముహూర్తాలు ప్రారంభం కావడంతో బాల్యవివాహాలను అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రారంభించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు సంచార వాహనం ద్వారా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పేదరికంలో ఉన్న కుటుంబాలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, బడి మానేసిన పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను చేరుకుని వారికి బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించనున్నారు.

సమాచారం అందించాలి

బాల్య వివాహాలను ప్రోత్సహించినా, పెళ్లిళ్లు జ రిపించినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వహించాం. గుళ్లు, మసీదులు, చర్చీలపైనా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098, 112 హెల్ప్‌లైన్‌ నంబర్లకు సమాచారం అందించాలి. బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలి.

– బి.మహేశ్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement