పూతపైనే ఆశలన్నీ..!
ఆశాజనకంగా మామిడి పూతలు గతంతో పోల్చితే ఈ ఏడాది దిగుబడి పెరిగే అవకాశం తేనెమంచు పురుగుతో పొంచి ఉన్న ముప్పు జిల్లాలో 980 ఎకరాల్లో తోటలు
రెబ్బెన: కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న మామి డి రైతుల్లో ఈ సీజన్‌లో పూతలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. మూడేళ్లుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు తోటలను తీవ్రంగా దెబ్బతీ శాయి. కనీసం సాగు కోసం పెట్టుబడులు కూడా అందలేదు. ఇతర జిల్లాలతో పోల్చితే స్థానిక వాతా వరణ పరిస్థితులతో ఆలస్యంగా వస్తున్న మామిడిపూతలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి సైతం కాస్త ఆలస్యంగానే పూత వచ్చినా.. పరిస్థితులు గతానికి భిన్నంగా ఉన్నాయి. దాదాపు అన్ని చెట్లకు నిండుగా పూత కనిపిస్తుండటంతో రైతులు సంబురపడుతున్నారు.
980 ఎకరాల్లో తోటలు
జిల్లాలోని పలు మండలాల్లో 980 ఎకరాల్లో మామి డి తోటలు సాగవుతున్నట్లు ఉద్యానవన శాఖ అధి కారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా రెబ్బె న, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), జైనూర్ మండలాల్లో రైతులు తోటలు సాగుచేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం సుమారు 50 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగినట్లు అంచనా. సాధారణంగా తోటల సాగుకు మామూలు నేలలు సరిపోతాయి. సారవంతం కాని భూములనే ఎంచుకుంటారు. దానికితోడు జిల్లాలో పత్తి సాగుపైనే రైతులు దృష్టి సారించడం, తేలిక పాటి భూముల్లోనూ మోతాదుకు మించి రసాయనిక ఎరువులను వినియోగిస్తూ పత్తిలో దిగుబడి సాధిస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా ప్రస్తుతం మామిడి తోటల సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
తోటలను ఆశిస్తున్న పురుగు
ప్రస్తుతం అధిక పగటి ఉష్ణోగ్రతలు, రాత్రిపూట చల్లటి వాతావరణం ఉంటోంది. దీంతో మామిడి తోటలను తేనె మంచు పురుగు ఆశిస్తుంది. పురుగు ఉధృతి కారణంగా పూతలు మాడిపోయి పిందెలు రాకుండా చేస్తోంది. నివారణకు రైతులు క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తుండటంతో పెట్టుబడి పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగితే పురుగు ఉధృతి తగ్గే అవకాశం ఉంది. ఆ లోగా తోటలకు నష్టం జరిగకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
తోటలు బాగున్నాయి
రెండు, మూడేళ్లతో పోల్చితే ఈసారి మామిడి తోటలు బాగున్నాయి. తేనె మంచు పురుగు ప్రభావం కనిపిస్తోంది. సకాలంలో నివారిస్తే పిందైపె ప్రభావం ఉండదు. నివారణకు రైతులు కీటకనాశిని క్లోరిపైరిపాస్ ద్రావణాన్ని లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున, అలాగే ఫంగి సైడ్ పౌడర్‌ను లీటర్‌కు 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.
అనుకూలంగా పరిస్థితులు
మూడేళ్లుగా నష్టాలనే చూస్తున్న మామిడి రైతులకు ఈసారి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సాధారణంగా చెట్టుకు పట్టిన పూతలో నుంచి కేవలం ఒక శాతం మాత్రమే పిందె దశకు చేరుకుంటుంది. మిగిలినదంతా రాలిపోతుంది. అయినా ఎకరానికి 8 టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది. జిల్లా వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావాన్ని బట్టి జిల్లాలో ఎకరానికి సగటు దిగుబడి 6 టన్నులు వరకు ఉంది. గత సంవత్సరం సీజన్ ప్రారంభం నుంచే కురిసిన అకాల వర్షాలు, ఆలస్యంగా వచ్చిన పూతలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. అకాల వర్షాలకు పిందెలు రాలిపోగా.. గాలివానల బీభత్సానికి చెట్లపై కాయలు సైతం దెబ్బతిన్నాయి. గాలికి రాలిన కాయలకు మార్కెట్‌లో అసలే ధర లేకపోవడం సైతం రైతులను మరింత కుంగదీసింది. మరో 10 రోజుల్లో పూతలు పిందె దశకు చేరుకుంటాయి. ఒక్కో చెట్టుకు ఆకులు కూడా కనిపించని రీతిలో పూత పట్టడంతో ఈసారి ఎకరానికి 8 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రకృతి, వాతావరణంపై దిగుబడి ఆధారపడి ఉంటుంది.
పూతపైనే ఆశలన్నీ..!


