సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాసిపేట: జిల్లాకేంద్రంలో రసవత్తరంగా సాగుతున్న సీఎం కప్–2026 జిల్లా స్థాయి పోటీల్లో కాసిపేట మండలం నుంచి ముగ్గురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు మండల ఇన్‌చార్జి పీడీ భుక్య రాజన్న తెలిపారు. శనివారం నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో మండల జట్టు తరఫున సోమగూడంకు చెందిన భుక్య సాయితేజ, బుగ్గగూడంకు చెందిన రాజేష్, పల్లె రఘువరన్ ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 20 నుంచి 23 వరకు నిర్వహించే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, కాసిపేట కాంప్లెక్స్ హెచ్‌ఎం మామిడిపల్లి సాంబమూర్తి, పలువురు సర్పంచులు, నాయకులు వారిని అభినందించారు.
మేకల మందపై కుక్కల దాడి
లక్సెట్టిపేట: మండలంలోని రంగపేట గ్రా మంలో మేకల మందపై కుక్కల దాడిలో 13 మృత్యువాత పడ్డాయి. 8 మేకలకు గాయాలయ్యాయి. బాధితుడు కొమురయ్య తెలిపిన వివరాలు.. గ్రామశివారులో మేకలను దొడ్డిలో ఉంచి శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లాను. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి మృత్యువాత పడి ఉన్నాయి. వీటి విలువ రూ.1.50 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నాడు. గాయపడిన మేకలకు పశు వైద్యాధికారులు వైద్యచికిత్స అందించారు. బాధితుడికి నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని సర్పంచ్ ముల్కల్ల రాందాస్ తెలిపారు.


