ఓవర్ టు మర్రిచెట్టు
ఇంద్రవెల్లి: ఈనెల 18న నిర్వహించే నాగోబా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగా జలంతో తిరుగు పయనమైన మెస్రం వంశీయులు బుధవారం కేస్లాపూర్ పొలిమెరకు చేరుకున్న విషయం తెలిసిందే. మర్రి చెట్టు వద్దనే ఆదివారం వరకు గడపనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక గుడారాలు వేసుకున్నారు. గురువారం రాత్రి పటేల్ కితకు చెందిన వంశీయులు రాగా వారికి సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన వారు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. రాత్రి పర్ధాన్ కితకు చెందిన మెస్రం పెద్దల ఆధ్వర్యంలో కిక్రి వాయిస్తూ నాగోబా చరిత్ర, 22 కితల మెస్రం వంశీయుల చరిత్రను బోధిస్తున్నారు. శుక్రవారం 22 కితల వారీగా జొన్న గట్కాతో పాటు సంప్రదాయ వంటలు చేసి నైవేద్యంగా సమర్పించారు. ఆచారం ప్రకారం గట్కాను ఉండలు చేసి కితల వారీగా పంపిణి చేశారు. వంశంలో మరణించిన పెద్దల పేరుతో రాత్రి తూమ్(కర్మకాండ) పూజలు చేశారు. ఆదివారం రాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి జాతర ప్రారంభించనున్నట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు.
ఆలయానికి చేరిన కుండలు
నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజలకు అవసరమయ్యే కుండలను సిరికొండలోని గుగ్గిల స్వామి తయారు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆయన ఏడు రకాలుగా తయారు చేసిన 350 కుండలు, మట్టి పాత్రలు శుక్రవారం సాయంత్రం నాగోబా ఆలయానికి చేరాయి. 20 పెద్ద బాణాలు, 55 సాధారణ కుండలు, 55 మూతలు, 45 కడుముంతలు,150 దీపాంతలను ఆలయానికి తీసుకొచ్చి భద్రపరిచారు.
ఓవర్ టు మర్రిచెట్టు
ఓవర్ టు మర్రిచెట్టు


