చికిత్స పొందుతూ మహిళ మృతి
జైపూర్: మండలంలోని షెట్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద గత శని వారం రాత్రి అదుపు తప్పి కారు చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంఽథని మండలం వెంకటాపూర్‌కు చెందిన గూడ కుషుడుకి జైపూర్ మండలం గంగిపల్లికి చెందిన శ్రావ్యతో వివాహమైంది. కుషుడు సింగరేణి కార్మికుడిగా పని చేస్తుండగా వీరు సీసీసీ సింగరేణి క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మేడారానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నక్రమంలో షెట్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపు తప్పి వేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుషుడు, అతడి భార్య శ్రావ్య, కుమార్తె ఐయాన్షీ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ శ్రావ్య హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వాగులో పడి యువకుడి మృతి
కాసిపేట: మండలంలోని రేగులగూడకు చెందిన మడావి జగదీశ్ (24) ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్ మేకకు మేత కోసం బుధవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం గ్రామ శివారులోని సల్ఫలవాగు సమీపంలో చూడగా నీటిలో పడి మృతి చెంది ఉన్నాడు. కాగా, జగదీశ్ చిన్నప్పటి నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వాగు దాటే క్రమంలో ఫిట్స్ వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
చెన్నూర్: చెన్నూర్ పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి చెందాడు. మృతుడి భార్య, సీఐ దేవేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన భోగారపు భీమయ్య, గట్టక్క దంపతులు గతేడాది చెన్నూర్‌కు చెందిన మారిపల్లి ప్రభాకర్‌రెడ్డి వద్దకు పత్తి తీసేందుకు వచ్చారు. ఉపాధి లభించడంతో దంపతులిద్దరు చెన్నూర్ గోదావరి రోడ్డులోని పత్తి చేను వద్ద నివాసముంటున్నారు. సంక్రాంతి సందర్భంగా భీమయ్య దంపతులు గురువారం సాయంత్రం నిత్యావసరాల కోసం చెన్నూర్‌కు వస్తున్నారు. జాతీయ రహదారి సమీపంలోని శనిగకుంట వద్ద గల పెట్రోల్ బంక్ ఎదుట మహారాష్ట్రలోని సిరోంచ నుంచి మోటర్ సైకిల్‌పై వస్తున్న బొగుట సంపత్ అతివేగంగా వచ్చి వెనుకనుంచి భీమయ్యను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య గట్టక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


