ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
జైపూర్: మండలంలోని కిష్టాపూర్ డీసీఎంఎస్ వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్‌కుమార్, ఎస్సై శ్రీధర్ వెల్ల డించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం తెప్పించి డీసీఎంఎస్ కేంద్రంలో విక్రయించినట్లు తప్పుడు లెక్కలు చూపించారని జిల్లా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డిస్ట్రిక్ మేనేజర్ శ్రీకల ఫిర్యాదు మేరకు డీసీఎంఎస్ నిర్వాహకులు మాదాసు రమేశ్, కొండపర్తి ప్రభాకర్, కొండ వెంకటేశ్, కట్కూరి రమణారెడ్డి, అవునూరి రాకేశ్, మాదాసు లావణ్య, బోగె మల్లయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత రబీ సీజన్‌లో సెంటర్ నిర్వాహకుడు రమేశ్ సాధారణంగా పండే ధాన్యం కన్నా ఎక్కువ పంటను కొనుగోలు చేసినట్లు చూపించి సివిల్ సప్లయ్ ఫండ్స్ నుంచి రూ.38,15,700లు కాజేసినట్లు తేల్చారు. అక్రమాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు మాదాసు రమేశ్, సహకరించిన బోగె మల్లయ్యను జైపూర్ ఎస్సై శ్రీధర్ టేకుమట్ల క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు, నిందితులను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీధర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.


