● కంకర టిప్పర్లతో తరచూ ప్రమాదాలు ● తాజాగా దహెగాంలో ఓ ఘట
కౌటాల/చింతలమానెపల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కంకర టిప్పర్, బస్సు ఢీకొని 19 మంది మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డు ప్రమాదాల తీవ్రత, అప్రమత్తతపై ఈ ఘటన ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. జిల్లాలో సైతం కంకర టిప్పర్లు తిరుగుతున్న మార్గాల్లో అలాంటి పరిస్థితులే ఉండడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. టిప్పర్ల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరాన్ని చేవెళ్ల దుర్ఘటన తెలియజేస్తోంది.
భారీ వాహనాల రాకపోకలు
కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లుతోపాటు గోలేటి సమీపంలోని సింగిరేణి ప్రాంతాలకు భారీ టిప్పర్లు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లా కేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపైనా పెద్దసంఖ్యలో భారీ వాహనాలు పలు రాష్ట్రాలకు సరుకులు చేరవేస్తున్నాయి. వీటిని జిల్లా స్థాయిలో ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కౌటాల మండలం ముత్తంపేట సమీపంలో, వాంకిడి మండలంలో కంకర క్వారీలు ఉన్నాయి. వీటి నుంచి కూడా నిత్యం వందల వాహనాల్లో కంకరను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అనుమతులు ఉన్నాయా..?
కౌటాల మండలం ముత్తంపేట సమీపంలోని కంకర క్వారీల నుంచి చింతలమానెపల్లి మండలం మీదుగా మహారాష్ట్రకు నిత్యం కంకర తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40 టన్నుల సామర్థ్యంతో రహదారులు, కల్వర్టులు, వంతెనలు నిర్మించారు. కానీ 50 నుంచి 60 టన్నుల పైగా కంకర లోడ్‌తో భారీ టిప్పర్లు వెళ్తున్నాయి. మహారాష్ట్రకు కంకర తరలించే వాహనాలకు అనుమతులు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా ఈ వాహనాల కారణంగా కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా.. అనేక మంది క్షతగాత్రులయ్యారు. మేకలు, గొర్రెలు, పశువులు చనిపోతున్నాయి. ఈ వాహనాలు నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తనిఖీలు చేస్తున్నాం
భారీ వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు జిల్లావ్యాప్తంగా తరచూ తనిఖీలు చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా మరింత నిఘా పెంచుతాం. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కౌటాల మండలం నుంచి కంకర తరలించే టిప్పర్లను తనిఖీ చేస్తాం. గతంలో పట్టుబడిన వాహనాలకు జరిమానా విధించాం. ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం పెరగాలి.
– రాంచందర్, జిల్లా రవాణాశాఖ అధికారి
కౌటాల మండల కేంద్రంలోని ఎస్‌బీఐ సమీపంలో కౌటాల– చింతలమానెపల్లి రోడ్డుపై మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లేగదూడ చనిపోయింది. ఉదయం గుర్తించిన గ్రామస్తులు రాత్రిపూట తిరుగుతున్న కంకర టిప్పర్ ఢీకొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు వారాల క్రితం చింతలపాటి సమీపంలో కంకర టిప్పర్ వేగంగా వచ్చి గొర్రె పిల్లను ఢీకొనడంతో మృతి చెందింది.
ఇరుకు రోడ్లు.. ఓవర్‌లోడ్
కౌటాల మండలం నుంచి చింతలమానెపల్లి మీదుగా కంకర టిప్పర్లు మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో పలు గ్రామీణ ప్రాంతాల రహదారులను దాటాల్సి ఉంది. ఆదాయాన్ని ఆర్జిచేందుకు అనుమతులు లేని రహదారులపై భారీ టిప్పర్లతో కంకర తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కౌటాల నుంచి రవీంద్రనగర్ మీదుగా చింతలమానెపల్లి రహదారి సింగిల్ రోడ్డు కావడంతో భారీ వాహనాలు ప్రయాణించడానికి అనుకూలంగా లేదు. మరో మార్గంలో డబ్బా మీదుగా బాబాసాగర్, చింతలమానెపల్లి రహదారిది ఇదే పరిస్థితి. చింతలమానెపల్లి నుంచి కర్జెల్లి మీదుగా గూడెం వరకు 20 కిలోమీటర్ల వరకు రహదారి కంకర టిప్పర్ల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. ఈ మార్గంలో టిప్పర్లు తరచూ అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. పలుమార్లు డ్రైవర్లు మ ద్యం తాగి ఆయా గ్రామాల్లో గొడవలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గూడెం గ్రామస్తులు కంకర టిప్పర్లను నిలిపి వేయాలని ఆందోళన చేపట్టి రహదారిపై ధర్నా నిర్వహించారు. భారీ వాహనాల కారణంగా ఓ వైపు రహదారులు ధ్వంసమవుతుండగా.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనుమతి లేని కంకర వాహనాలపై నిఘా పెంచి నియంత్రించాలని.. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
● కంకర టిప్పర్లతో తరచూ ప్రమాదాలు ● తాజాగా దహెగాంలో ఓ ఘట
● కంకర టిప్పర్లతో తరచూ ప్రమాదాలు ● తాజాగా దహెగాంలో ఓ ఘట


