వైభవంగా మహాపాదయాత్ర
సిర్పూర్(టి): శ్రీసిద్ది టోంకిని హనుమాన్ ఆలయానికి మంగళవారం చేపట్టిన 24వ మహాపాదయాత్ర వైభవంగా సాగింది. భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూకట్టారు. కాగజ్‌నగర్ పట్టణం నుంచి సిర్పూర్(టి) మండల కేంద్రం మీదుగా కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సమీప మండలాలకు చెందిన భక్తులతోపాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మహాపాదయాత్రకు సుమారు 40వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనా. భక్తుల సౌకర్యార్థం కాగజ్‌నగర్ నుంచి సిర్పూర్(టి) వరకు ప్రధాన రహదారిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు పాలు, పండ్లు, అల్పాహారం, తాగునీరు అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కౌటాల సీఐ సంతోష్‌కుమార్, సిర్పూర్(టి) ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ ఆలయాన్ని సందర్శించి బందోబస్తును పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సాయంత్రం వరకు సిర్పూర్(టి)– కౌటాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ అజయ్ ఉల్లం ఆలయంలో పూజలు న్విహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి సన్మానించారు.
వైభవంగా మహాపాదయాత్ర
వైభవంగా మహాపాదయాత్ర


