ఎఫ్‌ఏలపై పనిభారం!
● కొత్త పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలేవి..? ● ఎనిమిదేళ్లుగా పాతవారికే బాధ్యతలు ● జనవరి నుంచి అందని వేతనాలు ● జిల్లాలో జోరుగా సాగుతున్న ఉపాధిహామీ పనులు
కెరమెరి(ఆసిఫాబాద్): కాంగ్రెస్ సర్కారు ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధిహామీ పనిదినాలు చేసిన భూమి లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లపై తీవ్ర పనిభారం పడుతోంది. కూలీలకు పనులు చూపడం, మస్టర్ల కేటాయింపు, జాబ్‌కార్డుల జారీలో ఎఫ్‌ఏలు కీలకంగా పనిచేస్తున్నారు. కానీ కొత్త పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పాత వారే అన్ని బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఒక్కొక్కరు రెండు, పంచాయతీల విధులు నిర్వర్తిస్తుండటంతో పర్యవేక్షణ తగ్గుతోంది. అదనపు భారం మోస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు అందడం లేదని, జనవరి నుంచి వేతనాలు కూడా చెల్లించడం లేదని ఎఫ్‌ఏలు వాపోతున్నారు.
335 జీపీలకు 171 మంది..
రాష్ట్ర ప్రభుత్వం 2019లో మేజర్ పంచాయతీలను విడదీసి, 500లకు పైగా జనాభా కలిగిన తండాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పంచాయతీలను యూనిట్‌గా తీసుకుని కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి ఒక్కరు చొప్పున విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ప్రస్తుతం జిల్లాలో కేవలం 171 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అనేక మండలాల్లో రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు ఒక్కరే చూస్తున్నారు. గత ప్రభుత్వం ఎఫ్‌ఏలు సమ్మె చేసిన సమయంలో తొలగించి మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఎనిమిదేళ్లు దాటినా కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు.
తగ్గిన పర్యవేక్షణ.. పెరిగిన పనిభారం
జిల్లాలో మొత్తం ఉపాధిహామీ జాబ్‌కార్డులు 1.23 లక్షలు ఉండగా, యాక్టీవ్ కార్డులు 9,1000 ఉన్నా యి. అలాగే కూలీలు 2.43 లక్షలు మంది ఉండగా, ప్రస్తుతం 1.70 లక్షల మంది పనులకు వెళ్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 44,33,227 పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నా కొత్త గ్రామ పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ తగ్గుతోంది. సకాలంలో పనులు పూర్తిచేయకపోవడం, పనిచేసిన వారికి డబ్బులు జమ కాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగి యడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారులు పంచాయ తీ నిర్వహణ చూస్తున్నారు. ఉపాధిహామీ పనులు నిర్వర్తించే ఎఫ్‌ఏలు.. ఓవైపు స్పెషల్ ఆఫీసర్లు, ఈజీఎస్ ఉన్నతాధికారుల మధ్య నలిగిపోతున్నా రు. గ్రేడ్ 1 ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,200, గ్రేడ్ 2 వారికి రూ.10,120, గ్రేడ్ 3 వారికి రూ.9,100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలు ఇంకా అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇబ్బందికరంగా మారింది
ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామ పంచాయతీలు కేటాయించడంతో విధులకు న్యాయం చేయలేకపోతున్నాం. ఒకే సమయంలో రెండు, మూడుచోట్ల పనులు చేయించడం ఇబ్బందికరంగా మారింది. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించాలి. తమపై పనిభారం తగ్గించాలి.
– బోయారే రమేశ్,
ఎఫ్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం
కొత్త పంచాయతీల్లో నూతనంగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా అదనపు బాధ్యతలు అప్పగించాం.
– దత్తారావు, డీఆర్‌డీవో
ఎఫ్‌ఏలపై పనిభారం!


