భోళా శంకరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం పరందోళి గ్రామ పంచాయతీలోని శంకర్‌లొద్దికి ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి సేవాలాల్ భక్తులు తరలివచ్చారు. శివలింగాన్ని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భోళాశంకరుడి సన్నిద్ధిలో ప్రత్యేక పూజలు చేశారు. కోర్కెలు నెరవేర్చాలని మొక్కుకుని.. భోగ్ సమర్పించారు. శివలింగం కింది భాగంలో ఉన్న జెండాలు, దేవతల ప్రతిమలకు పూజలు చేశారు. గుహ ఎదుట ఉన్న నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాజూరా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డె శివలింగానికి దర్శించుకున్నారు. ప్రేంసింగ్ మహరాజ్ ఆశీర్వాదం తీసుకుని ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.


