నూతన పార్లమెంట్ స్థానంగా
కొత్తగూడెంకు అవకాశం
ఖమ్మం రూరల్, కల్లూరు, పాల్వంచ కేంద్రాలుగా అసెంబ్లీ స్థానాలు
పునర్విభజనతో మారనున్న
నియోజకవర్గాల రూపురేఖలు
‘కొత్త’గూడెం పార్లమెంట్ స్థానం..
నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరిగే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఒక పార్లమెంట్, మహబూబాబాద్ స్థానంలో కొంత పరిధి ఉండగా, పది అసెంబ్లీ స్థానాలు కొనసాగుతున్నాయి. పునర్విభజనతో మరో పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుత స్థానాల పరిధి, రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో మరో లోక్‌సభ స్థానం ఏర్పాటుకానుంది. ప్రస్తుతం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, పినపాక, ఇల్లెందు మాత్రం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతీ లోక్‌సభ స్థానంలో ఆరు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చే అవకాశముంది. ఈ లెక్కన ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, వైరా, మధిర, నూతనంగా ఏర్పడే ఖమ్మం రూరల్, కల్లూరు నియోజకవర్గాలు ఖమ్మం లోక్‌సభ పరిధిలోకి చేరతాయి. కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, నూతనంగా ఏర్పడే పాల్వంచ స్థానాలతో కొత్తగూడెం లోక్‌సభ నియోజవర్గం ఏర్పడే
అవకాశముంది.
చివరిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారాయి. అంతకుముందు ఉమ్మడి జిల్లాలో తొమ్మి ది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట ఏర్పాటైంది. ఈ నియోజకవర్గంలో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, అన్నపురెడ్డిపల్లి మండలాలు చేరాయి. అంతేకాక బూర్గంపాడు నియోజకవర్గం రద్దయి ఆ స్థానంలో పినపాక వచ్చింది. అలాగే, జనరల్ నియోజకవర్గం సుజాతనగర్ రద్దు కాగా వైరా రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఏర్పడింది. అంతేకాక జనరల్‌గా ఉన్న సత్తుపల్లి రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్‌గా ఉన్న పాలేరు జనరల్ కేటగిరీ లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు మాత్రమే జనరల్ కేటగిరీలో ఉండగా, మిగిలినవన్నీ రిజర్వ్ అయ్యాయి.
నియోజకవర్గాల పునర్విభజనతో రిజర్వేషన్లు, పరిధిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కొత్త స్థానాల్లోనే వచ్చే సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 2026 తర్వాత జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టా లని చట్ట సవరణ చేసినా, లెక్కలు పూర్తి కాకపోవడంతో సంశయం నెలకొంది. కానీ కేంద్రం కేబినెట్ తాజాగా ఆమోదించడంతో పునర్విభజనకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లయింది. ఈమేరకు 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేయనున్నారు. రాష్ట్ర జనాభా, మొత్తం అసెంబ్లీ స్థానాలను ఆధారంగా చేసుకుని అసెంబ్లీ స్థానం పూర్తిగా జిల్లా పరిధిలోనే ఉండేలా ఖరారు చేస్తారు.
ప్రస్తుత నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో కొత్తగా మూడు శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటుకానున్నాయి. ప్రస్తుతం ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. జనాభా లెక్కల ఆధరంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్, కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయని అంచనా. అంతేకాక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న నిబంధనతో రూపురేఖలు మారనున్నాయి. వైరా నియోజకవర్గ పరిధి లోని జూలూరుపాడు మండలం కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది. అలాగే, భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం, వాజేడు మండలాలు ములుగు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుత పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన కూనవరం, చింతూరు, వీఆర్.పురం, భద్రాచలంలోని కొంతభాగం మిన హా.. ఇతర జిల్లాల్లోని మండలాలు మళ్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి చేరే అవకాశముంది.
నియోజకవర్గాల
పునర్విభజనపై పార్టీల్లో చర్చ


