ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం నిర్వహించగా, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయమూర్తుల పూజలు
మధిర/ఎర్రుపాలెం: సత్తుపల్లి ఆరో అడిషనల్ జిల్లా కోర్టు న్యాయమర్తి మారగాని శ్రీనివాసరావు దంపతులు, మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి జమలాపురం ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అర్చకులు, ఆలయ అధికారులు న్యాయమూర్తులను స్వాగతించి పూజల అనంతరం ఆశీర్వచనం, శేషవస్త్రాలు అందజేశారు. ఆ తర్వాత న్యాయమూర్తులు ఎర్రుపాలెంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధు ల సంక్షేమం, ఆరోగ్యంపై నిర్వాహకురాలు డెయిసీతో చర్చించి పండ్లు పంపిణీ చేశారు. అలాగే, మధిర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన న్యాయవాదులకు ఇచ్చిన శిక్షణలో న్యాయమూర్తులు మారగాని శ్రీనివాస్, ప్రశాంతి, దీప్తి పాల్గొన్నారు. తొలుత మధిరలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. మధిర బార్ అసోసియేషన్ చైర్మన్ చావలి రామరాజు, న్యాయవాదులు కట్టా పూర్ణచంద్రరావు, గంధం శ్రీనివాసరావు, పారా లీగల్ వలంటీర్ కె.వెంకట్, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.


