బోనకల్: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన యాసంగిలో వరి కాకుండా ఆరు తడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇదే విషయమై బోనకల్ మండలం కలకోటలో టముకు వేయించాలని సూచిస్తే... టముకు వేసిన వ్యక్తి అసలు పంటలే సాగు చేయొద్దని చెప్పాడు. దీన్ని వీడియో తీసిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం కలెక్టర్ దివాకరకు చేరింది. దీంతో ఆయన సూచనల మేరకు జిల్లా పంచాయతీ అధికారి జి.వినోద్ శనివారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి రాముతో పాటు పాలకవర్గ సభ్యులతో ఆయన మాట్లాడారు. కలకోట పెద్దచెరువు కింద 2వేల ఎకరాల ఆయకట్టు ఉందని, వరి సాగు చేస్తే తాగునీటికి ఇబ్బంది వస్తుందని ఆరు తడి పంటలను ప్రోత్సహించేలా టముకు వేయించినట్లు తెలిపారు. కానీ టముకు వేసిన వ్యక్తి కారణంగా పొరపాటు జరిగిందని డీపీఓకు వివరించారు. దీంతో ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని మరోమారు టముకు వేయించాలని కార్యదర్శికి సూచించారు. అనంతరం బోనకల్‌లోని కస్తూర్బా పాఠశాలలో ఇంకుడుగుంతల నిర్మాణం, జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణను డీపీఓ పరిశీలించారు. ఎంపీఓ కృష్ణచైతన్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వరి బదులు పంటలే సాగు చేయొద్దని ప్రచారం


