ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచాలి

Nov 29 2026 1:59 PM | Updated on Nov 29 2026 1:59 PM

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సేవలను మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై శనివారం ఆయన కలెక్టరేట్‌లో ప్రోగ్రాం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గర్భిణుల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలన్నారు. ఇదే సమయాన అనవసరపు సిజేరియన్లను నివారించి, సాధారణ ప్రసవాలతో ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. అలాగే, ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద జీజీహెచ్‌కు రిఫర్‌ చేసిన కేసుల వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని సూచించారు. అంతేకాక తక్కువ బరువుతో జన్మించిన, నెలలు నిండని, పుట్టుకతో లోపాలున్న 0–5 ఏళ్ల పిల్లలను ఆర్‌బీఎస్‌కే బృందాలు, అంగన్‌వాడీ టీచర్లు, పీహెచ్‌సీల ద్వారా గుర్తించి న్యూట్రిషన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్లలో చేర్పించాలని తెలిపారు. అనంతరం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ మిగిలిన 70 మంది బాలికలకు కూడా వేసి 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహణ, ఇంటింటా జ్వర సర్వే, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో ఫాగింగ్‌, యాంటీ లార్వా చర్యలు, క్షయ బాధితులకు పౌష్టికాహారం కిట్ల పంపిణీపై సూచనలు చేశారు. కాగా, కుష్ఠు వ్యాధిలో గ్రేడ్‌–2 వైకల్యం సున్నా శాతానికి చేరడంపై కలెక్టర్‌ అభినందించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ రామారావు, వివిధ విభాగాల ప్రోగ్రాం అధికారులు లక్ష్మీనారాయణ, వేణుగోపాల్‌రెడ్డి, అరుణ, బిందుశ్రీ, మోత్యా, జిల్లా మలేరియా అధికారి కె. వెంకటేశ్వర్లు, సీఈఆర్‌టీఎస్‌ ప్రోగ్రాం మేనేజర్‌ ఎస్‌.కే.నసీరుద్దీన్‌ పాల్గొన్నారు.

అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement