ఖమ్మంవ్యవసాయం: రైతులు, వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్న జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ని మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలన్న నిర్ణయం సరికాదని సహకార సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు. మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్‌ను విలీనం చేయాలన్న అంశంపై చర్చించేందుకు శనివారం ఖమ్మంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మహాజనసభ జరిగింది. సంస్థ పర్సన్ ఇన్చార్జ్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ల చైర్మన్లు పాల్గొన్నారు. విలీనం ప్రధాన అజెండాగా నిర్వహించిన సభలో అభిప్రాయాలు చెప్పే అవకాశం చైర్మన్లకు ఇవ్వగా పలువురు మాట్లాడారు.
డీసీఎంఎస్‌కు ఆస్తులు.. మార్క్‌ఫెడ్‌కు అప్పులు
ఖమ్మం డీసీఎంఎస్‌కు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర తదితర ప్రాంతాల్లో రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయని చైర్మన్లు తెలిపారు. ధాన్యం, అపరాలు, మొక్కజొన్న పంటల కొనుగోళ్లు, ఎరువుల అమ్మకంతో రైతులకు లబ్ధి జరుగుతోందని చెప్పారు. ఇప్పుడు నష్టాల్లో ఉన్న మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్‌ను విలీనం చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. ఈమేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ లేఖను అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, బిజినెస్ మేనేజర్ కె.సందీప్, పీఏసీఎస్‌ల చైర్మన్లు బాగం హేమంతరావు, సామినేని వెంకటేశ్వరరావు, నాగుబండి శ్రీనివాసరావు, జి.సోమిరెడ్డి, చల్లగుండ కృష్ణయ్య, ఏ.శ్రీనివాసరావు, జక్కుల లక్ష్మయ్య, కొంచెం వెంకటేశ్వర్లు, మారుతి ఎట్టయ్య, తోళ్లకోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ముక్తకంఠంతో వ్యతిరేకించిన
పీఏసీఎస్‌ల ప్రతినిధులు


