నిధులు రావు.. భారం తీరదు | - | Sakshi
Sakshi News home page

నిధులు రావు.. భారం తీరదు

Nov 25 2026 12:26 AM | Updated on Nov 25 2026 12:26 AM

రైతువేదికల నిర్వహణ బాధ్యత ఏఈఓలకు.. నాలుగేళ్లుగా పైసా ఇవ్వని ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి రూ.4.50 లక్షల మేర బకాయి

ఖమ్మంవ్యవసాయం: రైతులకు సలహాలు, సూచనలు అందించాల్సిన రైతు వేదికలు వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓ)పై భారాన్ని మోపుతున్నాయి. కేంద్రాల నిర్వహణకు నిధులు రాకపోవడంతో విద్యుత్‌ బిల్లులు మొదలు తాగునీరు, పారిశుద్ధ్యం, స్టేషనరీ, చిన్నపాటి మరమ్మతుల వరకు సిబ్బందిపైనే భారం పడుతోంది. దీంతో చేసేదేం లేక కొందరు ఏఈఓలు సొంత డబ్బు వెచ్చిస్తుండగా, మరికొందరు అప్పులు చేయాల్సి వస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 196 రైతు వేదికలు

ఖమ్మం జిల్లాలో 129, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 రైతు వేదికలు కలిపి మొత్తం ఉమ్మడి జిల్లాలో 196 రైతు వేదికలు ఉన్నాయి. ఒక్కో రైతు వేదికకు ఒక ఏఈఓ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమాన ఖమ్మం జిల్లాలో 129 మంది ఏఈఓలకు 109 మంది, భద్రాద్రి జిల్లాలో 67 మందికి గాను 57 మందే పనిచేస్తున్నారు. ఫలితంగా కొందరికి రెండేసి వేదికల బాధ్యతలు అప్పగించడంతో... వారికి నిర్వహణ ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి.

కాగితాలపైనే పెంపు

వ్యవసాయ శాఖలో జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి నిధులను ఎప్పటికప్పుడు అధికారులకు విడుదలవుతున్నాయి. కానీ ఏఈఓలకు రైతు వేదికల నిర్వహణ ఖర్చులు మాత్రం అందించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో రైతు వేదికకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూ.4.50 లక్షల వరకు బకాయి ఉండగా, రాష్ట్రంలోని 2,601 రైతు వేదికలకు నాలుగేళ్లలో రూ.117 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. రైతు వేదికల నిర్వహణకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.3 వేల చొప్పున అందేవి. అనంతరం రూ.9 వేలకు పెంచారు. అయితే, నిర్వహణ నిధులను 2022 ఏప్రిల్‌ నుంచి 2022 ఆగస్టు వరకు అంటే కేవలం ఐదు నెలలకు సంబంధించినవి మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే 50 నెలల నిధులు బకాయి ఉన్నాయి.

ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..

రైతు వేదికల్లో కేవలం వ్యవసాయ శాఖ నిర్వహించే కార్యక్రమాలే కాక ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తున్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, వివిధ శాఖల సమావేశాలు, కొన్నిచోట్ల ప్రతీ సోమవారం ప్రజావాణి కూడా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యాన నిర్వహణకు సంబంధించి పెండింగ్‌ నిధులు విడుదల చేయడమే కాక ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని ఏఈఓలు కోరుతున్నారు. అంతేకాక అటెండర్లను నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement