జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. రోజంతా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కాగా, సాయంత్రం తర్వాత పలు చోట్ల ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. జల్లులు మొదలు ఓ మోస్తరువర్షం రాత్రి పొద్దుపోయే వరకు కురుస్తూనే ఉంది. దీంతో కల్లాలు, మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో ఉరుకులు, పరుగులపై చేరుకుని ధాన్యాన్ని రక్షించుకునేలా పట్టాలు కప్పారు. ఇంకొందరు తడిసిన ధాన్యాన్ని ఇళ్లకు తరలించారు. వైరా మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం తడవకుండా రైతులు జేసీబీల సాయంతో కుప్పలు చేసి పట్టాలు కప్పారు. వైరా మండలం గరికపాడు, దాచాపురం, రెబ్బవరంతో పాటు పలు గ్రామాల్లో వర్షం కురవగా, రహదారి వెంట ఆరబోసిన ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. తల్లాడ మండలంలో కూడా ధాన్యం పట్టాలు కప్పినా నీరు చేరడంతో తడిసింది. నేలకొండపల్లి మండలంలోని సింగారెడ్డిపాలెం, ముజ్జుగూడెం, మంగాపురంతండా, బైరవునిపల్లి, చెరువుమాధారం, ఆజయ్‌తండా, బోదులబండ, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో వర్షంతో ధాన్యం తడిసిపోగా, రైతులు చీకట్లోనే ఇళ్లకు తరలించారు. ఇక కల్లూరు, పెనుబల్లి మండలాల్లో చిరుజల్లులు కురవడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతో రైతులు రాత్రంతా ధాన్యాన్ని రక్షించుకునేందుకు జాగారం చేయాల్సి వచ్చింది.
– వైరా/వైరా రూరల్/తల్లాడ/నేలకొండపల్లి/కల్లూరు రూరల్/పెనుబల్లి


