తనిఖీల మాటెత్తని అధికారులు
● ట్రాలీలు, ట్రాక్టర్లలో లెక్కకు మిక్కిలిగా తరలింపు ● వ్యవసాయ సీజన్లో వరుసగా ప్రమాదాలు ● ఇటీవలే ఇద్దరు మృతి.. తాజాగా పలువురికి గాయాలు
ఖమ్మంక్రైం: ఏటా పత్తి సీజన్ మొదలు మిర్చి సీజన్ ముగిసే వరకు కూలీలకు డిమాండ్ ఉంటుంది. పొట్ట కూటి కోసం ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లడం ఆనవాయితీ. ఈక్రమాన రైతులు, మధ్యవర్తులు వీరిని ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లలో సామర్ాధ్యనికి మించి తరలిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలతో కూలీల భద్రతపై కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యవసాయ పనులకు కూలీలను మాట్లాడే మేసీ్త్రలు, కాంట్రాక్టర్లు ట్రాలీలు, ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నారు. అడ్డా నుంచి పని ప్రదేశానికి, సాయంత్రం స్వగ్రామాలకు చేర్చే సమయాన వాహనాల్లో లెక్కకు మించి తరలించడం కనిపిస్తోంది. దీనికితోడు వాహనాల డ్రైవర్లు మితిమీరిన వేగంతో ఇష్టారీతిగా నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇటీవల రఘునాథపాలెం మండలంలో వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన టిప్పర్ను ఢీకొనగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. తాజాగా గురువారం మధిర మండలం సిరిపురం టోల్గేట్ వద్ద కంకర్ లారీ ఆటోను ఢీకొట్టడంతో అందులో పనికి వెళ్తున్న మహిళా కూలీలు పలువురు గాయపడ్డారు. ఘటన సమయాన ఆటోలో 20 మంది కూలీలు ఉండడం గమనార్హం. గతంలోనూ బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం, కారేపల్లి తదితర ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.
వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే వాహనాలు ప్రమాదాల బారిన పడడానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. కొందరికి లైసెన్స్ లేకపోవడం, ఉన్నా మితిమీరిన వేగంతో నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ నేపథ్యాన వ్యవసాయ సీజన్లలో ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలను కట్టడి చేసేందుకు రవాణాశాఖ కానీ పోలీస్ ఉద్యోగులు తనిఖీల మాటెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. తరచుగా తనిఖీలు చేపట్టి ఓవర్లోడ్, అతివేగంతో వెళ్లే వాహనాలను కట్టడి చేస్తే ఫలితం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం పత్తితీతలు జోరుగా సాగుతుండడం, త్వరలోనే మిర్చి సీజన్ మొదలుకానున్న నేపథ్యాన అధికారులు ఇకనైనా తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.


