● ఎల్నినో నేపథ్యాన డ్రిప్ విధానంతో నీటి పొదుపు ● కీలకంగా ఎరువులు, క్రిమిసంహారక మందుల యాజమాన్యం
కాపాడుకోండి ఇలా..
ఖమ్మంవ్యవసాయం: ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోపక్క లోటు వర్షపాతంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ క్రమాన ప్రభుత్వ సూచనలతో రైతులు ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపారు. జిల్లాలోని 46,470 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుండగా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటను రక్షించుకోవడంపై దృష్టి సారించాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది. నీటి యాజమాన్య చర్యలు, యాజమాన్య పద్ధతులపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈక్రమాన జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.
డ్రిప్ ద్వారా నీటి పొదుపు
ప్రతీ నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాల్సి ఉన్నందున ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీరు అందించాలి. డ్రిప్ పైపులు, ఎమిటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో, లేదో తరచూ తనిఖీ చేయాలి. మొక్కల వయస్సు, నేల స్వభావానికి అనుగుణంగా నీటి తడులు ఇవ్వాలి. అంతేకాక నేలపై తేమ ఆవిరి కాకుండా మొక్క మొదలు చుట్టూ ఎండిన ఆయిల్ పామ్ ఆకులు, సేంద్రియ పదార్థాలతో మల్చింగ్ చేయాలి. ఇది నేలను చల్లబరిచి నీటి వృథాను తగ్గిస్తుంది. వర్షపు నీటి కోసం నిల్వ గుంతలు, వ్యవసాయ కుంటలను వినియోగించుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
ఎల్నినో కారణంగా రుగోస్ వైట్ ఫ్లై, బోండార్స్ వైట్ ఫ్లై, కొమ్ము పురుగు వంటి తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. సిఫారసు చేసిన మందులు, ఆస్పెర్గిల్లస్ వంటి జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి. కాండం కుళ్లు తెగులు నివారణకు ట్రైకోడెర్మా వాడాలి. ఇక అధిక ఉష్ణోగ్రతల వల్ల పరాగ సంపర్కం చేసే వీవిల్స్ దెబ్బతిని గెలలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించేందుకు డ్రిప్ ఔట్లెట్లు తెరిచి తోటలో తేమ పెంచాలి, సుబాబుల్, కాజురినా వంటి గాలి నిరోధక మొక్కలు, కోకో వంటి అంతర పంటలు వేయాలి. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ తోటలను కాపాడుకుంటే, సమస్యలు ఎదురైతే సంప్రదించాలి.


