వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం గ్రామంలో ఆదివారం అరుదైన పక్షి కనిపించింది. గ్రామానికి చెందిన ఆవుల ప్రవీణ్ ఇంటి ఆవరణలో ఈ పక్షిని గుర్తించగా స్థానికులు ఆసక్తిగా పరిశీలించారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో సంచరించే గుడ్లగూబను పోలిన ఈ పక్షి జనావాసాల్లోకి రావడం అరుదని తెలిపారు. ఎగరలేని పరిస్థితిలో ఉన్న పక్షి, కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయింది.
సీఈఆర్ క్లబ్,
కమ్యూనిటీ హాల్ ప్రారంభం
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి ఏరియా పీవీఎన్‌ఆర్ కాలనీలో నిర్మించిన సీఈఆర్ క్లబ్, కమ్యూనిటీ హాల్‌ను సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) కొప్పుల వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంటుందని తెలిపారు. కార్మికుల మానసిక ఉల్లాసం, వ్యాయామంతో పాటు కార్యక్రమాల నిర్వహణకు సీఈఆర్ క్లబ్, కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.వెంకటాచారి, వివిధ విభాగాల అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన రేపటి నుంచి నిరసనలు
ఖమ్మం వైరారోడ్: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించడమే కాక రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు తెలపనున్నట్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు వరుస కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టడమే కాక పాలనలో విఫలమైందని ఆరోపించారు. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఉమ్మడి జిల్లాలో చేపట్టే కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పువ్వాడ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
గైనకాలజిస్ట్ ఎంపికకు 3న ఇంటర్వ్యూలు
ఖమ్మం వైద్యవిభాగం: మధిర ఏరియా ఆస్పత్రిలో రెండు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన గైనకాలజిస్ట్‌ను నియమించనున్నట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. ఎంపికై న వారికి రూ.లక్ష చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఎంబీబీఎస్‌తో పాటు ఎంఎస్(ఓబీ, జీవై) ఉత్తీర్ణులై అదనపు అర్హతలు, అనుభవం కలిగి ఉండడమేకాక ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్యసంస్థల్లో పనిచేసిన ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3న కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు.
ప్రజలకు మెరుగైన
వైద్యసేవలు
చింతకాని: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రామారావు సూచించారు. చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం తనిఖీ చేసిన ఆయన వైద్యులు, సిబ్బంది హాజరు, రోజువారీ ఓపీ రిజిస్టర్లతో ఫార్మసీలో మందుల లభ్యతను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని తెలిపారు.


