రెండు కేంద్రాల్లో 26మంది గైర్హాజరు
చివరి నిమిషాన ఉరుకులు, పరుగులు
ఖమ్మం సహకారనగర్: వైద్య విద్యకు సంబంధించిన పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష(నీట్ పీజీ) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని రెండు కేంద్రాల్లో 668మంది అభ్యర్థులకు గాను 642మంది హాజరు కాగా 26మంది గైర్హాజరయ్యారు. ఖమ్మంలోని ఎస్‌బీఐటీలో 268మందికి 252మంది, కొణిజర్ల మండలంలోని అయాన్ డిజిటల్ జోన్(లక్ష్య కళాశాల) కేంద్రంలో 400మందికి 390మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. కేంద్రాలను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా కోఆర్డినేషన్ ఆఫీసర్ కె.రవిబాబు పరిశీలించారు.
కాగా, కేంద్రాల వద్ద ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్, ఎస్సైలు, సిబ్బందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్ష ఉదయం 9నుంచి 12–30గంటల వరకు నిర్వహించగా, అభ్యర్థులను ఉదయం 7–30నుంచి 8–30గంటల వరకు తనిఖీల అనంతరం అనుమతించారు.
చివరలో హడావుడి
నీట్ పీజీకి పటిష్టమైన ఏర్పాట్లు చేసి అభ్యర్థులను గంటన్నర ముందు నుంచే అనుమతిస్తామని ప్రకటించారు. అయినా చివరి సమయాన ఒకరిద్దరు పరుగులు తీస్తూ చేరుకున్నారు. ఇక దివ్యాంగుడైన ఓ అభ్యర్థి ఆధార్‌కార్డు తీసుకురాకపోవడంతో అనుమతించలేదు. దీంతో పోలీసు కానిస్టేబుల్ తన వాహనంపై తీసుకెళ్లి ఆధార్‌కార్డుతో సమయానికి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.


