సామాన్యలకు సత్వర న్యాయం
ప్రభుత్వం 1987లో న్యాయసేవాధికార చట్టాన్ని ప్రవేశపెట్టింది. కేవలం డబ్బు ఉన్న వారికే న్యాయం సొంతమే అపోహ సమాజంలో ఉంది. దీన్ని తొలగించేందుకు రాజ్యాంగంలోని 39వ అధికరణ ద్వారా పార్లమెంట్ ఈ న్యాయసేవాధికార చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి పేదలకు న్యాయ సాయం అందించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు, కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. ప్రీ లిటిగేషన్ కేసులు ఎక్కువ శాతం విచారణకు ముందే లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కారమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ చట్టం, న్యాయంపై అవగాహన లేక ఇబ్బందుల పాలవుతున్న సామాన్య ప్రజలకు చటాన్ని వివరించి సత్వరన్యాయం అందించడం లోక్‌అదాలత్‌ల ద్వారా సాధ్యమవుతోంది.
ప్రత్యామ్నాయ పరిష్కారం..
రాజ్యాంగం కల్పించిన చట్టం, న్యాయాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించేందుకు న్యాయసేవా సంస్థలు అవతరించాయి.
దేశంలో ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతి(ఏడీఆర్) సూత్రాన్ని అనుసరించి ప్రభుత్వం ప్రజా న్యాయపీఠం (లోక్ అదాలత్) ప్రక్రియను చట్టరీత్యా ప్రవేశపెట్టారు. న్యాయసేవాధికార సంస్థల చట్టంలోని 9వ అధికరణ ప్రకారం న్యాయపరమైన సమస్యలపై ఇరువర్గాలకు నచ్చజెప్పి వారి సమ్మతితో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు. ఇందులో ఎలాంటి బలవంతం ఉండదు. ఏ పౌరుడు ఆర్థిక కారణాలు, మరే ఇతర బలహీనతల ద్వారా న్యాయాన్ని పొందే అవకాశాన్ని కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయసాయం సైతం అందిస్తున్నారు.


