ప్రజా సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ధ్యేయం

Aug 31 2026 12:56 AM | Updated on Aug 31 2026 12:56 AM

● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ● చింతకాని, బోనకల్‌ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ● చింతకాని, బోనకల్‌ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చింతకాని/బోనకల్‌: రాష్ట్రప్రజల సంక్షేమానికి పాటుపడుతూనే అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. చింతకాని, బోనకల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేశారు. అలాగే, చింతకాని మండలం లచ్చుగూడెంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలకు శంకుస్థాపన చేయడమే కాక నిర్మాణం పూర్తయిన గోదాంలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.06కోట్ల కుటుంబాలకు రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, 53లక్షల కుటుంబాలకు గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. అలాగే, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇందిరమ్మ ఇల్ల మంజూరు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ పథకాలతో అన్నివర్గాలకు మేలు చేస్తున్నామని తెలిపారు.

భూ సమస్య పరిష్కరించాలని...

చింతకాని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసి తిరిగి వెళ్తుండగా దళిత మహిళలు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కారుకు అడ్డు వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దళితులకు ఇచ్చిన మూడెకరాల భూమిలో కొందరికి అన్యాయం జరిగిందని, పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికి పరిష్కారం కావడం లేదని తెలిపారు. దీంతో భట్టి కారు దిగి సమస్య తెలుసుకోవడమే కాక పరిష్కరించాలని ఆర్డీఓను ఆదేశించారు.

రూ.100కోట్లకు పైగా పనులు

చింతకాని, బోనకల్‌ మండలాల్లో పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం రూ.100కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చింతకాని మండలం లచ్చగూడెంలో రూ.29 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణంతో పాటు రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాక నారాయణపురంలో వేయి మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాం, రాపల్లిలో గ్రామపంచాయతీ భవనం, కలకోటలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కార్యాలయాన్ని భట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ దివాకర, సీపీ సునీల్‌దత్‌, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, కార్పొరేషన్ల చైర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరావు, మధిర, మత్కేపల్లి మార్కెట్లు, మున్సిపల్‌ చైర్మన్లు బండారు నరసింహారావు, అంబటి వెంకటేశ్వరరావు, సామినేని సుజాత, తహసీల్ధార్‌ సుదాకర్‌, ఎంపీడీఓ రవికుమార్‌తో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు కర్నాటి రామకోటేశ్వరావు, బత్తినేని నాగప్రసాద్‌, పైడిపల్లి కిశోర్‌కుమార్‌, కరివేధ సుధాకర్‌, కొంగల శ్రీనివాసరావు, సండ్ర సరిత, అనిత, మర్రి సురేష్‌, కిలారు మనోహర్‌బాబు, కొప్పుల రజిని, బయ్యా నాగమణి, ఏపూరి పద్మ, కొప్పుల గోవిందరావు, కన్నెబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement