● అతివేగంగా వచ్చిన బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి ● పెళ్లికి వచ్చి వెళ్తున్న తోడల్లుళ్లు కన్నుమూత
ఎర్రుపాలెం: ఒక ప్రమాదం సొంత అక్కాచెల్లెళ్ల పసుపు, కుంకుమను తుడిచేసింది. అతివేగంగా, అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ బైక్‌ను ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ తోడల్లుళ్లు కావడంతో వారి కుటుంబంలో తీర్చలేని విషాదాన్ని నింపింది. జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలో ఆది వారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
శుభకార్యానికి వచ్చి మృత్యుఒడికి...
ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ముల్లంగి లాజర్–జవ్వాయమ్మ కుమార్తెల్లో ఒకరిని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెసరమల్లి నాగరాజు వివాహం చేసుకున్నాడు. మరో కుమార్తెకు ఏపీ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకొప్పుల రమేష్‌తో వివాహం జరిగింది. ఇందులో నాగరాజు బతుకుదెరువు నిమిత్తం ఇటీవల హైదరాబాద్ వెళ్లగా, రమేష్ ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. వీరిద్దరు ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలోని తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా రామాలయం వెనకాల మెయిన్ రోడ్డుపై మలుపు వద్ద గ్రావెల్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ఆపై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడగా నాగరాజు, రమేష్ దాని కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే ప్రమాదంలో తోడల్లుళ్లు ప్రాణాలు విడవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలియగానే వారి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు, బంధువులు పెద్దసంఖ్యలో చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.రమేష్‌కుమార్ సిబ్బందితో వచ్చి జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను ఎత్తి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా, రమేష్‌కు భార్యతో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.


