● భూసమస్యల పరిష్కారానికి ‘భూభారతి’ ● ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్/ఖమ్మంమయూరిసెంటర్: గడిచిన రెండేళ్లలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని పాలేరు నియోజకవర్గ డివిజన్లలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించిన పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు మొదలు ఆడబిడ్డల ఉచిత ప్రయాణం వరకు ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కలను విస్మరించగా, తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. అలాగే, భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా ధరణితో ఎదురైన కష్టాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాదర్బార్‌ల ద్వారా చిన్నచిన్న సమస్యలను వేదికపైనే పరిష్కరించేలా అధికారుల ను ఆదేశించామని, మిగతావి వారంనుంచి మూడు నెలల్లోపరిష్కరిస్తామని వెల్లడించారు. రెండేళ్ల క్రితం పోలిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సి ఉందని, ఆ పనులు కూడా పూర్తయ్యాకే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని పొంగులేటి స్పష్టం చేశారు. మాటలు చెప్పడం కాదు.. పనిచేసి చూపించడమే తన నైజమని ఉద్ఘాటించారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్. మాట్లాడుతూ.. ఇప్పటివరకు క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ల ద్వారా సుమారు 16 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇందులో ప్రతీ దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారురాలు జయలక్ష్మి, మమత మాట్లాడుతూ.. ప్రస్తుతం సొంత ఇంట్లో ఆనందంగా జీవిస్తున్నామ ని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పి.అనిత, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్‌బాబు, కేఎంసీ, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ అగస్త్య, శ్రీనివాసరెడ్డి, అడిషనల్ డీసీపీ రామానుజం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జూన్‌లో వనజీవి స్మారకవనానికి శంకుస్థాపన
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా లక్షలాది మొక్కలు నాటి సంరక్షించిన పద్మశ్రీ వనజీవి రామయ్య స్మారక వనానికి జూన్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాదర్భార్‌లో రామయ్య సతీమణి జానమ్మ మంత్రిని కలిసి తన గోడు చెప్పుకోగా మంత్రి స్పందించారు. స్మారకవనం ఏర్పాటుకు తక్షణమే స్థలాన్ని సేకరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్.ను ఆయన ఆదేశించారు.


